టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాక్‌ ట్విస్ట్‌! | College Student And Tvk Leader Case Then A U Turn | Sakshi
Sakshi News home page

టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాక్‌ ట్విస్ట్‌!

Oct 24 2026 8:10 AM | Updated on Oct 24 2026 8:12 AM

College Student And Tvk Leader Case Then A U Turn

లైంగిక దాడి జరిగిందంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన కాలేజీ విద్యార్థిని.. ఒక్కరోజు తిరిగేసరికి తన నిర్ణయం మార్చుకుంది.. అధికార టీవీకే నేతపై ఫిర్యాదు చేసిన ఆమె.. మరుసటి రోజే కేసు వెనక్కి తీసుకోవాలని, నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని కోరింది. అసలు ఒక్కరోజులో ఏం జరిగింది? బాధితురాలు మనసు మార్చుకోవడం వెనుక ఏదైనా ఒత్తిడి ఉందా? తమిళనాడులో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గురువారం.. బాధితురాలు తన కాలేజీ స్నేహితురాలితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో క్రిస్టోఫర్‌ అనే వ్యక్తి కారులో అటువైపు వచ్చాడు. అతడికి బాధితురాలి స్నేహితురాలు పరిచయం ఉండటంతో వారిద్దరికీ లిఫ్ట్‌ ఇచ్చాడు. మార్గమధ్యలో స్నేహితురాలు దిగిపోయిన తర్వాత.. బాధితురాలిని ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో క్రిస్టోఫర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడని విద్యార్థిని ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే లైంగిక దాడి కేసు నమోదు చేశారు. అయితే, మరుసటి రోజే బాధితురాలు.. తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోద్దంటూ కోరినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామంతో బాధితురాలిపై అధికార పార్టీ నేతలు డబ్బు, పలుకుబడి, బెదిరింపుల ద్వారా ఒత్తిడి తెచ్చి ఉంటారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ఈ ఘటనపై అధికార టీవీకే పార్టీపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి.. ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధించారు. తన పార్టీకి చెందిన నేతపై లైంగిక దాడి ఆరోపణలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారని నిలదీశారు. టీవీకే పార్టీ నేరస్థులకు, లైంగిక నేరాలకు పాల్పడేవారికి ఆశ్రయంగా మారుతోందని ఆమె ఆరోపించారు. బాధితురాలికి రక్షణ కల్పించాలని, నిందితుడిపై నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.

ఈ ఘటనపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో లైంగిక వేధింపుల కేసుల్లో టీవీకే నేతల పేర్లు తరచూ వినిపిస్తున్నాయన్నారు. చట్టాలను రూపొందించాల్సినవారే అదే పార్టీలో ఉంటూ చట్టాలను ఉల్లంఘించే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ ఆరోపణలపై టీవీకే నేతలు, అధికార ప్రతినిధులు బహిరంగంగా స్పందించలేదు. అయితే, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పార్టీ నేత మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు

ఇదీ చదవండి: ఇరాన్‌ బిగ్‌ ప్లాన్‌.. ట్రంప్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement