టీవీకే ఐటీ వింగ్ ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటోలు
చెన్నై: ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ ముసుగు తొలిగిపోయిందని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) విమర్శించింది. ద్రవిడ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి డీఎంకే దాసోహమైందని ఆరోపించింది. స్వప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే కాషాయ పార్టీ పంచన చేరిందని పేర్కొంది. తమ కుటుంబ సభ్యులు, డీఎంకే నాయకులపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే కేంద్రం నిర్ణయానికి స్టాలిన్ మద్దతు తెలిపారని ఆరోపించింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంతో టీవీకే తీవ్రస్థాయిలో స్పందించింది. స్టాలిన్‌ను సావర్కర్ 2.ఓగా పేర్కొంటూ శనివారం టీవీకే ఐటీ వింగ్ ఎక్స్ ఖాతాలో ఫొటో షేర్ చేసింది. స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి.. ఆరెస్సెస్ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నట్టు మరో ఫోటో పెట్టింది.
అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేక వైఖరి ప్రదర్శించిన స్టాలిన్.. అధికారం కోల్పోగానే మాట మార్చారని టీవీకే మండిపడింది. “బీజేపీని వ్యతిరేకించే ఏకైక పార్టీ మాదే, నల్లజెండాలు ఎగురవేసి ఢిల్లీ అహంకారాన్ని ఎదిరిస్తాం, నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించడమే మన ఆత్మగౌరవం” అంటూ ఎన్నికలకు ముందు ప్రగబ్భాలు పలికిన డీఎంకే నాయకత్వం ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేసింది.
డీఎంకే నిజస్వరూపం బయటపడింది
బీజేపీ చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించడమే ఆత్మగౌరవమని చెప్పిన డీఎంకే.. ఇప్పుడు అదే బీజేపీ ప్రతిపాదనను అంగీకరించి స్వాగతిస్తోందని టీవీకే ధ్వజమెత్తింది. తమ వైఖరిలో వచ్చిన మార్పును డీఎంకే సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది. బీజేపీకి మద్దతు ఇవ్వాలని డీఎంకే తీసుకున్న నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మరుక్షణమే తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. బీజేపీతో ఇప్పటివరకు పరోక్ష సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన డీఎంకే.. ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని తెలిపింది.
ఇదేనా మీ సిద్ధాంతం?
అన్నాడీఎంకేకు ప్రధానమంత్రి మోదీ రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారని గతంలో విమర్శించిన డీఎంకే నాయకత్వం.. ఇప్పుడు బీజేపీ చెంతకు చేరడం ద్వారా తమకు కూడా రింగ్ మాస్టర్ బీజేపీయేనని చెప్పకనే చెప్పిందని టీవీకే వ్యాఖ్యానించింది. ''ఇలాంటి రాజకీయ జూదానికి పెట్టిన పేరేనా మీ సిద్ధాంతం? ఇప్పుడు ఎక్కడికి పోయింది పెరియార్ ఆత్మగౌరవ భావన? అన్నాదురై ప్రవచించిన ద్రావిడ సిద్ధాంతాల అనుసరణ ఏమైంది? డీఎంకే గర్వం ఎక్కడికి పోయింది? మీ పార్టీ ధైర్యం, తెగువ ఏమయ్యాయి? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పెరియార్, అన్నా పేర్లను ఉపయోగించుకుంటున్నారా? మీరు చేస్తున్న పనులను వారి ఆత్మలు కూడా క్షమించవు. మైనారిటీ సోదరులు, తమిళనాడు ప్రజలు సైతం మిమ్మల్ని క్షమించరు'' అంటూ టీవీకే ధ్వజమెత్తింది.
ఇదీ చదవండి: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు
తమిళనాడు, దక్షిణ భారత ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా డీఎంకే చేస్తున్న విన్యాసాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని.. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ డీఎంకేకు కోలుకోలేని ఘోర పరాజయం తప్పదని హెచ్చరించింది.


