ఏలూరు: ఆ గిరిజన యువతి వయసు 22.. అవివాహితురాలు.. వయసుకు తగ్గట్టే పంచాయతీ ఎన్నికల్లో 22 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఆకట్టుకుంది. వేలేరుపాడు మండలంలోని తాట్కూరు గొమ్ము పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపర్చిన నూపా ఇందుమతి గురువారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందింది.
ఆమెకు 1,615 ఓట్లు రాగా.. ప్రత్యర్థి టీడీపీ బలపర్చిన అభ్యర్థినికి 1,593 ఓట్లు రావడంతో 22 ఓట్ల ఆధిక్యంతో ఆమెను విజయం వరించింది. మండలంలోని వసంతవాడకి చెందిన నూపా రాధాకృష్ణ, కామేశ్వరి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు కాగా.. పెద్ద కుమార్తె అఖిల ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె ఇందుమతి ఇంటర్మీడియట్ పూర్తిచేసి వెటనరీ అప్రెంటీస్ చేస్తోంది.
వీరి కుటుంబం కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో వైఎస్సార్‌సీపీ వేలేరుపాడు మండల నాయకులను ఆమె సంప్రదించగా వారు మద్దతిచ్చారు. పిన్న వయసుల్లో సర్పంచ్ గా గెలిచి అందరి మన్ననలు పొందుతోంది. ఈ సందర్భంగా ఇందుమతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి పాటుపడతానని అన్నారు.
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో బిగ్ ఫైట్.. కింగ్ మేకర్‌గా స్టాలిన్!


