విజయ్‌ సర్కార్‌కు పరీక్ష.. పళనిస్వామి షాకింగ్‌ కామెంట్స్‌ | AIADMK Palaniswami slams Vijay govt handling of Thiruparankundram | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌కు పరీక్ష.. పళనిస్వామి షాకింగ్‌ కామెంట్స్‌

Nov 28 2026 1:26 PM | Updated on Nov 28 2026 1:26 PM

AIADMK Palaniswami slams Vijay govt handling of Thiruparankundram

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తిరుప్పరంకుండ్రం కొండ వివాదం మరోసారి కాకరేపుతోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాజకీయ దుమారం మొదలైంది. తాజాగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు మందలింపులతో తమిళనాడు పరువు దేశవ్యాప్తంగా పోయిందని విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో భద్రత CRPFకు!

తిరుప్పరంకుండ్రం కొండ ప్రాంతానికి సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక చర్యలు తీసుకుంది. అక్కడి భద్రతా బాధ్యతలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు అప్పగించడంతో పాటు, ఆలయ ట్రస్టీల బోర్డును రద్దు చేసి, ఆలయ పరిపాలన పర్యవేక్షణకు మాజీ హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు పళనిస్వామి వెల్లడించారు. గతంలోనే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని విమర్శించారు.

అలాగే, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పళనిస్వామి ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనా గందరగోళం, న్యాయస్థానాల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని కఠినంగా నియంత్రించకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించినట్లు తెలిపారు. తమిళనాడు చరిత్రలో ఒక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడం అరుదైన పరిణామమని పళనిస్వామి వ్యాఖ్యానించారు.

విజయ్ ప్రభుత్వంపై సెటైర్లు!
టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పళనిస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెరగని అవమానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. చట్టం, రాజ్యాంగం, సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలు ఎంతో గౌరవప్రదమైనవని, వాటిని చిన్నపిల్లల ఆటబొమ్మల మాదిరిగా భావించకూడదని హితవు పలికారు. సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు తగిన మార్గాన్ని అన్వేషించాలని టీవీకే ప్రభుత్వానికి సూచించారు. దీంతో, తిరుప్పరంకుండ్రం వివాదం ఇప్పుడు న్యాయపరమైన అంశంగానే కాకుండా తమిళనాడు రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఇదీ చదవండి: దీపం వివాదం.. ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement