బెంగళూరు: మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కేరళకు చెందిన 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ఓ లాడ్జిలో దారుణంగా హతమార్చాడు. గంగా, గోకుల్ కృష్ణ లాడ్జిలో గది తీసుకున్నారు.
మరో వ్యక్తితో గంగా సంబంధం కొనసాగిస్తోందన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన గోకుల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కత్తితో ఆమెపై దాడి చేశాడు. కడుపు ఎడమవైపు కింది భాగంతో పాటు శరీరంలోని పలు చోట్ల విచక్షణారహితంగా పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గంగా రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉంది. గదిలోని మంచంతో పాటు మెట్ల మార్గంలోనూ రక్తపు మరకలు కనిపించాయి.
వెంటనే గంగాను సమీపంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గంగా, గోకుల్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బెంగళూరులోని హర్ష కాలేజీలో ఇద్దరూ కలిసి నర్సింగ్ కోర్సు చదువుకున్నారు. గోకుల్ కంటే గంగా జూనియర్. వీరిద్దరూ కేరళకు చెందినవారే. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఇద్దరూ బెంగళూరుకు వచ్చారు. గంగా ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది.
యువతికి తోడుగా వచ్చిన నిందితుడు.. ఉద్యోగం వెతుక్కోవడానికి ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నౌక కోసం అన్వేషిస్తుండగా.. ఊహించని దృశ్యం..


