అబుదాబీ: యూఏఈలో ఓ ఐటీ ఉద్యోగికి జాక్‌పాట్ తగిలింది. లక్కీ డ్రాలో రూ.6.29 లక్షలు గెలుచుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు లక్కీ డ్రాలో పాల్గొన్నప్పటికీ అదృష్టం తలుపు తట్టలేదు. ఈ సారి జ్యోతిష్యుడి సాయం తీసుకున్నాడు. లక్కీ డ్రాలో గెలుపొందాడు.
ప్రముఖ లక్కీ డ్రా అబుదాబి బిగ్ టికెట్ వారాంతపు డ్రాలో జ్యోతిష్యుడు సలహా ప్రకారం టికెట్ నంబర్ ఎంచుకున్న తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల ఐటీ ఉద్యోగి అరవిందన్ కె. సుమారు 25,000 దిర్హామ్‌లు ( భారత కరెన్సీలో సుమారు రూ.6.29 లక్షలు) గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా తమ తల్లి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అవసరమైన క్లిష్ట సమయంలో ఈ విజయం లభించడంతో తమ కుటుంబానికి ఇది ఎంతో ఊరటనిచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సాధారణంగా గతంలో అరవిందన్ తన స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ కొనుగోలు చేసేవారు. అయితే, ఈసారి తన సోదరుడితో కలిసి టికెట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దక్షిణ భారత్‌కు చెందిన ఓ జ్యోతిష్యుడి సూచనల మేరకు ఎంచుకున్న 406550 నంబర్ కలిగిన టికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ నవంబర్ 26 నిర్వహించిన నవంబర్ మూడో వారాంతపు ఎలక్ట్రానిక్ డ్రాలో ఈ నంబర్‌తో పెద్దమొత్తంలో బహుమతి దక్కింది.
అరవిందన్ గతేడాది ఆరునెలల ప్రాజెక్ట్ నిమిత్తం అబుదాబికి వెళ్లారు. అక్కడ మాజీ సహోద్యోగుల ద్వారా బిగ్ టికెట్ గురించి తెలిసింది. గెలుపు వార్తతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు తనకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
‘విజయం గురించి ఫోన్ వచ్చినప్పుడు నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. మా కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మా అమ్మ వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఈ బహుమతి రావడం మాకు ఎంతో తోడ్పడుతుంది’ అని అరవిందన్ తెలిపారు. వచ్చిన బహుమతి మొత్తాన్ని తన సోదరుడితో పంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితులకు కూడా భవిష్యత్తులో ఇలాంటి విజయం దక్కాలని ఆకాంక్షించారు.


