0, 0, 6, 6, 6, 1, 4, 0, 1, 6, 6, 0, 6, 0, 6, 6, 6, 4, 6, 6, 0, 0, 6, 6, 1, 6, 4, 4, 6, 6, 4, 2, 1, 6, 1, 6, 4, 6, 0, 6, 6, 0, 6, 1, 6, 6, 6, 6, 4, 0, 6, 6, అవుట్
53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204 పరుగులు సాధించిన కుర్రాడు
28 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
52 బంతుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో అసాధారణ ప్రదర్శన
యూఏఈపై 7 వికెట్లతో భారత్ విజయం
ఒక్కసారి కొడితే అనూహ్యం... రెండో సారి కొడితేసంచలనం...మూడో సారి కొడితే అద్భుతం... కానీ మళ్లీ మళ్లీ అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిస్తే ఏమని వివరించాలి... వర్ణనలకు, విశేషాలకు అందని అసాధారణ ఆటతో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌లో మరోసారి సునామీసృష్టించాడు. ఊహకు అందని రీతిలో బ్యాట్‌ను ఝళిపిస్తూ ఒక్క మ్యాచ్‌తోనే రికార్డుల వరద పారించాడు. నిర్దాక్షిణ్యంగా అతను కొట్టిన దెబ్బకు యూఏఈ బౌలర్లంతా అల్లాడిపోయి అచేతనావస్థకు చేరుకున్నారు.
బౌలర్ చేతినుంచి బంతి దాటడమే తరువాయి...అర క్షణంలో దానిని సిక్సర్‌గా మలచడమే వైభవ్ పనిగా పెట్టుకున్నాడు. స్క్వేర్ లెగ్, డీప్ మిడ్‌వికెట్, కౌ కార్నర్, లాంగాన్, లాంగాఫ్, స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్, కవర్స్, ఎక్స్‌ట్రా కవర్, డీప్ కవర్, థర్డ్‌మాన్... ఇలా ఏ దిశను వదలిపెట్టలేదు. ఈ క్రమంలో ఒక జట్టంతా కలిసి కూడా కొట్టలేని 28 సిక్సర్లను వైభవ్ ఒంటి చేత్తో బాది పడేశాడు. అంటే 168 పరుగులు సిక్సర్లతోనే వచ్చాయి. 15 ఏళ్ల కుర్రాడి నుంచి వచ్చిన ఆ బ్యాట్ పవర్, స్పీడ్ నమ్మశక్యం కాని రీతిలో ఒక మాయా ప్రపంచాన్ని చూపించాయి.
అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు కలిపి లెక్కించే లిస్ట్–ఎ క్రికెట్‌లో ఇప్పుడు లెక్కలేనన్ని రికార్డులు వైభవ్ సొంతమయ్యాయి. ఈ మ్యాచ్‌కు ముందే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అతని పేరిట ఉండగా... ఈ ఒక్క మ్యాచ్‌తోనే ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలను తన పేరిట లిఖించుకున్నాడు. వీటికి తోడు అత్యధిక సిక్సర్ల ఘనత అదనం. ఇక ‘అతి చిన్న వయసులో’ అంటూ వైభవ్ నెలకొల్పిన రికార్డుల జాబితా మాత్రం అతని వయసుకంటే చాలా పెద్దది!
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ విజయలక్ష్యం 250 పరుగులు... అయితే వైభవ్ బీభత్స బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించి టోర్నీలో సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, బాసిల్ హమీద్ (36 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్‌కు 4 వికెట్లు దక్కాయి. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది.
ఇన్నింగ్స్ సాగిందిలా...
తొలి రెండు బంతులకు పరుగు తీయకుండా వైభవ్ ఆట మొదలైంది! కానీ ఆపై తుఫాన్ ఎదురు లేకుండా సాగిపోయింది. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 3 సిక్స్‌లు, రెండో ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు, మూడో ఓవర్లో మరో మూడు సిక్స్‌లు...16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తయింది. నాలుగో ఓవర్లో ఒకే ఫోర్ రావడంతో కాస్త ప్రశాంతత కనిపించగా, తర్వాతి ఓవర్లో మళ్లీ 3 సిక్స్‌లు సీన్ షురూ...ఇబ్రార్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ హైలైట్‌గా నిలిచింది. అంతకు ముందు అభిషేక్‌ను ఎల్బీగా అవుట్ చేసిన తర్వాత భారత బ్యాటర్ దగ్గరకు వచ్చి సెండాఫ్ ఇస్తూ ఇబ్రార్ పరుష పదాలు వాడాడు.
నీ ప్రతీకారం కూడా నేనే తీర్చుకుంటా అన్నట్లుగా వైభవ్ వరుసగా 6, 4, 4, 6, 6, 4తో 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడో బంతికే 28 బంతుల్లో సెంచరీ కూడా పూర్తయింది. 10 ఓవర్ల పవర్‌ప్లే ముగిసే సరికే వైభవ్ 21 సిక్సర్లు బాదేశాడు. పైగా 40 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను కూడా దాటాడు. అతను 160 వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేయడం ఆపై కలిసొచ్చింది. సూరి వేసిన 12వ ఓవర్లో కూడా వరుసగా 6, 6, 6, 6, 4 కొట్టడంతో 28 పరుగులు లభించాయి.
13వ ఓవర్ నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌గా మలచడంతో 52 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకొని కుర్రాడు చిరునవ్వులు చిందించాడు. ఏకంగా 51 బంతుల తేడాతో పాత డబుల్ సెంచరీ రికార్డును వైభవ్ పడగొట్టడం విశేషం! ఈ మైలురాయిని అందుకున్న తర్వాత ఆడిన రెండు బంతులు వైడ్ కాగా, తర్వాతి బంతికి క్యాచ్ ఇవ్వడంతో ఈ సునామీకి విరామం లభించింది.
28 సిక్సర్లు కొట్టాడిలా...

లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
28 బంతుల్లో సెంచరీ – జేక్ ఫ్రేజర్ (29 బంతుల్లో) రికార్డు బద్దలు
40 బంతుల్లో 150 – తన పేరిటే ఉన్న(59 బంతుల్లో) రికార్డు బద్దలు
52 బంతుల్లో డబుల్ సెంచరీ – బోవెస్ (103 బంతుల్లో) రికార్డు బద్దలు
384.90 – వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్‌రేట్... ఏబీ డివిలియర్స్ (338.63) రికార్డు బద్దలు
15 ఏళ్ల 242 రోజులు – అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ... యశస్వి జైస్వాల్ (17 ఏళ్ల 292 రోజులు) రికార్డు బద్దలు
28 సిక్సర్లు – డార్సీ షార్ట్ (23) రికార్డు బద్దలు
గత రెండు మ్యాచ్‌లలో మంచి ఆరంభాలను వృథా చేసుకున్నాను. కాబట్టి ఈ సారి ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండాలని భావించా. పిచ్‌కు బౌలర్లకు అనుకూలించడం లేదని అర్థమైంది. దాంతో నాపై నమ్మకం ఉంచి షాట్లకు ప్రయత్నించా. – వైభవ్
స్కోరు వివరాలు
యూఏఈ ఇన్నింగ్స్: ఆర్యాంశ్ (సి) కుశాగ్ర (బి) హర్షిత్ 2; అన్‡్ష (సి) అభిషేక్ (బి) అర్షద్ 8; హర్‌ప్రీత్ (బి) అర్షద్ 130; షహదాద్ (ఎల్బీ) (బి) దూబే 28; డిసౌజా (సి) హర్షిత్ (బి) షహబాజ్ 25; ఆలమ్ (సి) సూర్యాంశ్ (బి) అర్షద్ 2; హమీద్ (నాటౌట్) 36; ఇబ్రార్ (సి) తిలక్ (బి) అర్షద్ 0; జాహిద్ (సి) తిలక్ (బి) సూర్యాంశ్ 7; సూరి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–2, 2–20, 3–91, 4–151, 5–154, 6–220, 7–220, 8–243.బౌలింగ్: హర్షిత్ 10–0–63–1, అర్షద్ 10–0–43–4, సూర్యాంశ్ 10–0–48–1, హర్ష్ దూబే 7–0–28–1, తిలక్ 4–0–21–0, రింకూ 5–0–22–0, షహబాజ్ 4–0–23–1.
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ఆర్యాంశ్ (బి) హమీద్ 204; అభిషేక్ (ఎల్బీ) (బి) ఇబ్రార్ 12; ప్రభ్‌సిమ్రన్ (సి) ఆలమ్ (బి) జాహిద్ 3; రింకూ (నాటౌట్) 27; కుశాగ్ర (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.2 ఓవర్లలో 3 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–68, 2–108, 3–245. బౌలింగ్: జాహిద్ 4–0–52–1, ఇబ్రార్ 3–0–71–1, హమీద్ 3.2– 0–59–1, సిమ్రన్‌జీత్ 2–0–22–0, సూరి 2–0–48–0.


