పాక్‌కు చుక్కలు చూపించిన నేపాల్‌ బౌలర్‌.. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్‌ | Asia Cup Rising Stars 2026: pakistan all out for 168 runs vs nepal | Sakshi
Sakshi News home page

పాక్‌కు చుక్కలు చూపించిన నేపాల్‌ బౌలర్‌.. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్‌

Nov 24 2026 7:08 PM | Updated on Nov 24 2026 7:13 PM

Asia Cup Rising Stars 2026: pakistan all out for 168 runs vs nepal

source: X

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇవాళ జరుగుతున్న చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌-ఎ, నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ బౌలర్లు పాక్‌ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ అనే రైట్‌ ఆర్మ్‌ మీడియం​ పేస్‌ బౌలర్‌ పాక్‌ బ్యాటర్ల పాలిట సింహస్వప్నం అయ్యాడు. 8 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఏకంగా ఐదుగురిని ఔట్‌ చేశాడు. 

రషీద్‌తో పాటు అభిషేశ్‌ గౌతమ్‌ (9-1-27-2), సందీప్‌ లామిచ్చేన్‌ (7-0-21-1), కుషాల్‌ భుర్టెల్‌ (9-0-35-1) రాణించడంతో పాక్‌ 42 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు, వికెట్‌కీపర్‌ రోహైల్‌ నజీర్‌ (64) అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. ఇతను ఆదుకోకపోయుంటే పాక్‌ కనీసం 100 పరుగులు కూడా చేసేది కాదు. 

ఆఖర్లో రోహైల్‌ అహ్మద్‌ దనియాల్‌ (16) సాయంతో పాక్‌ను 100 పరుగుల మార్కును దాటించాడు. వీరిద్దరు కాకుండా పాక్‌ ఇన్నింగ్స్‌లో మరో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. హసన్‌ నవాజ్‌ 28, కెప్టెన్‌ అబ్దుల్‌ సమద్‌ 13, హైదర్‌ అలీ 15, మాజ్‌ సదాకత్‌ 13 పరుగులు చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన ఫర్హాన్‌ యూసఫ్‌, మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన మొహమ్మద్‌ ఇమ్రాన్‌ రంధవ ఈ మ్యాచ్‌లో గోల్డన్‌ డకౌట్‌ అయ్యారు. ఓపెనర్‌ షమిల్‌ హుసేన్‌ 6 పరుగులకే వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన నేపాల్‌.. ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 పరుగులకే ఆలౌటై, 306 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ బౌలర్ల ధాటికి విలవిలలాడిన పాక్‌, ఇదే టోర్నీలో భారత్‌పై 48 పరుగుల తేడాతో గెలుపొందింది.

కాగా, ఈ మ్యాచ్‌ గెలుపోటములతో సంబంధం లేకుండా పాక్‌ ఇదివరకే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. గ్రూప్‌-బి నుంచి పాక్‌తో పాటు భారత-ఎ జట్టు కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇవాళే యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. మరోవైపు గ్రూప్‌-ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌-ఎ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. 

ఇదీ చదవండి: వైభవ్‌ సూర్యవంశీ మహోగ్రరూపం.. సెమీస్‌లో టీమిండియా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement