ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత-ఎ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు ఆసీస్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (29 బంతులు) పేరిట ఉండేది.
సెంచరీ తర్వాత కూడా వైభవ్ ఊగిపోతున్నాడు. యూఏఈ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భారత్ 7 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. వైభవ్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 119 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా రింకూ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు.
హర్ప్రీత్ భాటియా సెంచరీ
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హర్ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కినా, మిగతా ప్లేయర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.
ఆఖర్లో కెప్టెన్ బాసిల్ హమీద్ (36 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ 250 పరుగుల మార్కు వరకు వచ్చింది. మిగతా ప్లేయర్లలో ముహమ్మద్ షాదాద్ (28), ఈథన్ డిసౌజా (25) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, సూర్యాంశ్ షేడ్గే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. గ్రూప్-బి నుంచి పాకిస్తాన్-ఎ మొదటి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్ పోటీపడుతుంద. మరోవైపు గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్-ఎ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.
ఇదీ చదవండి: హర్షిత్ రాణా సహా భారత ప్లేయర్లపై పాక్ ఆటగాళ్ల ఫిర్యాదు..!


