Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌లో టీమిండియా రెండు నెలల పర్యటన చివరి అంకానికి చేరుకుంది. టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం క్రైస్ట్‌చర్చి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గిల్ నేతృత్వంలోని టీమిండియా బృందం మంగళవారం ఉదయం క్రైస్ట్‌చర్చిలో అడుగుపెట్టింది. ఈ మేరకు ఆటగాళ్లు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఫొటోలను బీసీసీఐ 'ఎక్స్' వేదికగా పంచుకుంది.
వెల్లింగ్టన్ టూ క్రైస్ట్‌చర్చి.. న్యూజిలాండ్ టూర్‌లో చివరి అంకానికి చేరుకున్నాం* అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం అంచుల దాకా వచ్చిన గిల్ సేన.. కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ పోరాటం వల్ల డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (1968), ఎంఎస్ ధోని (2009లో) తర్వాత న్యూజిలాండ్ గడ్డపై టెస్టు విజయంతో సిరీస్ గెలుచుకునే సదవకాశం గిల్ ముంగిట ఉంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో ఎలాంటి వైఫల్యాలు కనిపించనప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం కాస్త మెరుగుపడాల్సిన అవసరముంది.
వెల్లింగ్టన్ పిచ్ పూర్తిగా బ్యాటర్లకు సహకరించడంతో ఇరుజట్ల బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టు పిచ్‌ను బౌలర్లకు అనుకూలించే విధంగా రూపొందించనున్నట్లు సమాచారం. మంగళవారం విశ్రాంతి తీసుకోనున్న భారత జట్టు బుధవారం ప్రాక్టీస్ చేయనుంది.
Wellington ➡️ Christchurch 📍 One final stop before we wrap up the New Zealand tour ✈️ #TeamIndia | #NZvIND https://t.co/KokUWMPKW3
— BCCI (@BCCI) November 24, 2026
ఇదీ చదవండి: IND Vs UAE: సూపర్‌మేన్ తరహాలో డైవ్.. కళ్లు చెదిరే క్యాచ్


