source: X
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని క్యారారా ఓవల్ మైదానం వేదికగా ఇవాళ రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
జట్టులో ఎవ్వరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా, దాదాపు అందరు బ్యాటర్లు తలో చేయి వేయడంతో ఈ స్కోర్ వచ్చింది. నిఖిల్ చౌదరి (45), జోయల్ డేవిస్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (27), మిచెల్ మార్ష్ (15), జాక్ ఎడ్వర్డ్స్ (18), డ్వార్షుయిస్ (18 నాటౌట్), లాచియన్ షా (10) రెండంకెల స్కోర్లు చేశారు.
సామ్ హార్పర్ (3), టిమ్ డేవిడ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో హెన్రీ క్రొకోంబ్, సామ్ కర్రన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే వికెట్ కూడా నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్ అనెరున్ డొనాల్డ్ (62 నాటౌట్) కేవలం 18 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మరో 64 పరుగులు చేస్తే విజయతీరాలకు చేరుకుంటుంది.
భారత్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టింది. క్యారారా ఓవల్ మైదానంలో అత్యధిక టీ20 స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది. గతంలో ఈ రికార్డు భారత్ పేరిట ఉండేది.
క్యారారా ఓవల్ మైదానంలో అత్యధిక టీ20 స్కోర్లు
184/8 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, 2026*
167/8 - భారత్ vs ఆస్ట్రేలియా, 2025
146/7 - ఆస్ట్రేలియా vs వెస్టిండీస్, 2022
ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన హర్ప్రీత్ సింగ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?


