source: X
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ చేరే అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. ఈ డ్రాతో టీమిండియా పాయింట్ల శాతం 51.52 నుంచి 50 శాతానికి పడిపోయింది.
తొలి టెస్టు డ్రా తర్వాత పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా 75 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్, భారత్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
భారత్ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి..?
భారత్ WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్-2లో నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో ఉండటంతో మిగిలిన టెస్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంది. ముఖ్యంగా విజయాల సంఖ్యను పెంచుకుంటూ పాయింట్ల శాతాన్ని మెరుగుపరుచుకోవాలి.
జూన్ 2027లో WTC ఫైనల్ జరగనుంది. దీనికి ముందు భారత్ ఆరు టెస్ట్‌లు ఆడనుంది. ఇందులో ఐదు గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు ఉంటాయి. టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్ వేదికగా నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.
అనంతరం భారత్ వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో సాధించే ఫలితాలు ఫైనల్ రేసులో భారత అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఉత్కంఠగా సాగింది. ఐదో రోజు ఆట ప్రారంభించే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 119/2తో ఉంది. భారత బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించినా.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అడ్డుగోడలా నిలిచారు.
వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 239/5 స్కోరు వద్ద ఉండగా.. ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. బేసిన్ రిజర్వ్ పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవడంతో భారత్‌కు విజయం దక్కలేదు.
ఇదీ చదవండి: భారత్ అంటేనే చెలరేగిపోతాడు.. కివీస్ జోడి సరికొత్త రికార్డు


