PC: X/BCCI
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు. వెల్లింగ్‌టన్‌లో భారత్ అనుసరించిన బ్యాటింగ్ వ్యూహాలు చక్కగా పనిచేశాయని.. అయితే, అదే సమయంలో స్పిన్నర్ అవసరాన్ని గుర్తించలేకపోయారని విమర్శించాడు.
అతడి అవసరం ఉంటుందని తెలియదా?
విదేశీ గడ్డ మీద ముఖ్యంగా పిచ్ పాతబడే కొద్దీ ఫ్లాట్‌గా మారే క్రమంలో నిఖార్సైన స్పిన్నర్ అవసరం ఉంటుందని దాదా గుర్తుచేశాడు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 (3-2), వన్డే (3-1) సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది.
భారత్- కివీస్ మధ్య వెల్లింగ్‌టన్‌లో గురువారం మొదలైన తొలి టెస్టు.. సోమవారం ‘డ్రా’గా ముగిసింది. బేసిన్ రిజర్వ్ మైదానంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ చేసింది.
720 పరుగులు
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 720 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (85) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. కేఎల్ రాహుల్ (136) శతక్కొట్టాడు. దేవదత్ పడిక్కల్ 80, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 98, ధ్రువ్ జురెల్ 78 పరుగులతో రాణించారు.
వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సెంచరీ (128)తో అలరించాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆటకు ఆఖరి రోజైన సోమవారం కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 239 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది.
ఆ వ్యూహాలు బాగున్నాయి
ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘‘న్యూజిలాండ్‌లో సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. తొలుత వైట్‌బాల్ క్రికెట్‌లో.. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ అదరగొడుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో వ్యూహాలు బాగున్నాయి.
కుల్దీప్ ఎక్కడ?
అయితే, విదేశీ గడ్డ మీద పిచ్ పాతబడే కొద్దీ ఫ్లాట్‌గా మారే క్రమంలో జట్టుకు నిఖార్సైన స్పిన్నర్ అవసరం ఉంటుందని యాజమాన్యం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఇది చాలా ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా ఆడాడు. మరి స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ లేదంటే మానవ్ సుతార్ ఎక్కడ బీసీసీఐ?’’ అని గంగూలీ టీమిండియా నాయకత్వ బృందాన్ని ప్రశ్నించాడు.

కాగా కివీస్‌తో తొలి టెస్టుకు ముందే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను యాజమాన్యం జట్టు నుంచి విడుదల చేసింది. వెల్లింగ్‌టన్ టెస్టులో సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కాదని.. వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది. వాషీ ఈ మ్యాచ్‌లో 24 పరుగులు చేయడంతో పాటు ఒకే ఒక్క వికెట్ తీశాడు.
ఇదీ చదవండి: వాళ్లిద్దరు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండో టెస్టులోనూ చోటు కష్టమే: గిల్


