source: X
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్‌లో భారత- ఎ జట్టు యూఏఈపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోయి, రికార్డు డబుల్ సెంచరీతో భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అంతకుముందు హర్ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో యూఏఈ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.
https://t.co/SbHf4aJG5N
— crictalk (@crictalk7) November 24, 2026
ఇబ్రార్‌తో అభిషేక్ వాగ్వాదం
ఈ మ్యాచ్‌లో భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇబ్రార్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అభిషేక్ వరుసగా బౌండరీ, సిక్సర్ బాది మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అభిషేక్‌ను ఔట్ చేసిన ఆనందంలో ఇబ్రార్ ఓవరాక్షన్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ ఇబ్రార్‌తో వాగ్వాదానికి దిగాడు.
పరిస్థితి చేయి దాటకుండా యూఏఈ ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఇబ్రార్‌ను పక్కకు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అభిషేక్ పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు కూడా ఇబ్రార్‌ను ఉద్దేశించి ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే వివాదంలో హర్షిత్
ఈ టోర్నీలో భారత-ఎ ఆటగాడు హర్షిత్ రాణా ఇప్పటికే వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్-ఎతో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ దూకుడుగా వ్యవహరించడంతో పాక్ మేనేజ్‌మెంట్ అతడిపై రిఫరీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సెమీస్‌కు భారత్
యూఏఈపై గెలుపుతో భారత ఎ జట్టు సెమీస్‌కు చేరింది. గ్రూప్ బి నుంచి పాకిస్తాన్ ఎ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్ ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ఎ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం.. సెమీస్‌లో టీమిండియా


