సాక్షి,చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమిలో చేరేందుకు డీఎంకే సుముఖంగా ఉందంటూ టీవీకే ఆరోపణ చేసింది. అయితే, ఈ ఆరోపణలను డీఎంకే తీవ్రంగా ఖండించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఓటింగ్ జరిగింది. అయితే, బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో అప్పట్లో అది వీగిపోయింది.
ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు సమాచారం. మరోవైపు, ఈ డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలోనే డీఎంకే,బీజేపీ కలయికపై టీవీకే చేసిన ఆరోపణలను డీఎంకే నేతలు తోసిపుచ్చారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత,ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ కానున్నట్లు డీఎంకే స్పష్టం చేసింది.
సాధారణంగా డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’ బీజేపీ నేతల విమర్శలను తిప్పికొడుతుంది. కానీ ఈసారి అనూహ్యంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలకు ప్రముఖ స్థానం కల్పించింది. ‘మురసోలి’ పత్రికలో సీఎం విజయ్‌పై నైనార్ నాగేంద్రన్ చేసిన విమర్శల్ని ప్రధానంగా ప్రస్తావించింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా, ఉమ్మడి ప్రత్యర్థిగా ఉన్న విజయ్‌ను ఇరుకున పెట్టే క్రమంలో డీఎంకే-బీజేపీ మధ్య రాజకీయ వైఖరి మారుతోందా అన్న చర్చకు ఇది దారితీసింది.
కాగా, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పొత్తులో భాగంగా బరిలోకి దిగాయి. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మంత్రి పదవులు అడిగినా అప్పుడు సర్దుబాటు చేసుకుని కలిసే పోటీ చేశాయి.కానీ ఫలితాలు తారుమారయ్యాయి. టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా.. డీఎంకే 59 సీట్లకే పరిమితమైంది.అనంతరం మే 6న కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి, మంత్రి పదవుల ఒప్పందంతో టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది.


