కుప్పంలో ఫ్యాన్‌ సునామీ | Ysrcp Big Victory In Chandrababu Constituency Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో ఫ్యాన్‌ సునామీ

Nov 27 2026 7:19 AM | Updated on Nov 27 2026 7:34 AM

Ysrcp Big Victory In Chandrababu Constituency Kuppam

అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా సడలని సంకల్పం 

అన్ని మండలాల్లోనూ వరుస విజయాలతో సంబరాలు 

ఓటు ద్వారా తీర్పును ప్రపంచానికి చాటిన ప్రజలు  

పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ ఢంకా 

2029 ఎన్నికల్లో మార్పుకు స్థానిక ఫలితాలే బీజం

సాక్షి, చిత్తూరు: ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదు. వేసిన వాళ్లను చంపేస్తామంటూ ఫోన్లలో బెదిరించారు. కొన్నిచోట్ల నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్ల పత్రాలు చించిపడేశారు. ప్రచారానికి వెళ్లాలంటే.. ఊర్లలోకి అడుగు పెట్టనివ్వలేదు. పోలింగ్‌ జరుగుతుండగా అభ్యర్థులను పోలీసులు జీపుల్లో ఎక్కించుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నా ఎక్కడా సంకల్పం కోల్పోలేదు.

ప్రజల్లో వైఎస్సార్‌ సీపీకి ఉన్న ఆదరణను.. ప్రపంచానికి తెలియచేయడానికి గట్టిగా నిలబడ్డారు. నిలబడ్డ వాళ్లకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని ప్రజలు ఓటు ద్వారా తీర్పునిచ్చేశారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 18మంది ఘన విజయం సాధించారు. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మార్పు సుస్పష్టమని.. కుప్పంలో వచ్చిన స్థానిక ఫలితాలతో సంకేతాలు పంపించారు.  

దిమ్మతిరిగే విజయం
జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన తీరు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. ఎక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోకనే 51 ఏకగ్రీవాలు చేసేశారు. నగరిలో చైర్మన్‌ను దొడ్డిదారిన ఏకగ్రీవంగా గెచినట్లు ప్రకటించారు. కుప్పంలో ఏకంగా చైర్మన్‌ అభ్యరి్థనే కిడ్నాప్‌ చేశారు. ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నడిరోడ్డుపై కాపుగాచి గూండాగిరి చేశారు.

తలలు పగులగొట్టి రక్తం కళ్ల చూశారు. చిత్తూరు, గంగాధరనెల్లూరుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊర్లలోనే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి, ప్రత్యర్థులను మట్టికరిపించారు. పంచాయతీ పోరులోనూ ఇదే ఫార్మలా పాటించిన తమ్ముళ్లు, వాళ్ల అరాచకాలను కుప్పం నుంచే ప్రారంభించి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడి, రక్తం రుచిచూశారు. అయినా సరే ఎక్కడా కూడా పార్టీ కార్యకర్తలు తగ్గలేదు. ధైర్యంగా నామినేషన్లు వేసి, ఎన్ని బెదిరింపులు వచ్చినా పోటీలో నిలబడ్డారు. చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా కుప్పంలో ఫ్యాన్‌ సునామీ సృష్టించారు.

విజేతలు వీరే.. 
శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో దీపావినోద్‌ నాయుడు, రాళ్లబూదుగూరులో సుబ్రమణ్యం గౌడు, కొలమడుగులో బి.సౌందర్య, దండికుప్పంలో జగదీష్, 30 సొన్నేగానిపల్లిలో ఎస్‌.శ్రీరాములు, ఎం.కె. పురంలో ప్రభాకర్, చెంగుబళ్లలో సుబ్రమణ్యం(టమోటా సుబ్బన్న), అనికెరలో సురేష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

కుప్పం మండలంలోని ఎన్‌.కొత్తపల్లిలో జి. చంద్రమ్మ, మహ్మద్‌పురంలో నాసీర్, మోట్లచేనులో సుశీల గెలుపొందారు. గుడుపల్లె మండలం గుండ్లసాగరంలో వత్సలమ్మ, చీకటిపల్లిలో కస్తూరి, పొగురుపల్లిలో సుబ్రమణ్యం, ఓఎన్‌ కొత్తూరులో కృష్ణవేణి విజయం సాధించారు. రామకుప్పంలో తన్హీర్‌బాషా, నారాయణపురంతాండాలో చక్రీనాయక్, బల్ల పంచాయతీలో హస్న వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలుపొందారు.  ఇక గెలిచిన స్థానాలను బలవంతంగా లాక్కోవడానికి అలవాటు పడిన టీడీపీ ఇక్కడున్న కోనేరుకుప్పంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యరి్థకి 18 ఓట్ల ఆధిక్యం వచ్చినా, టీడీపీ గెలిచినట్లు డిక్లరేషన్‌ ఇప్పించారు.

ఉరకలేసే ఉత్సాహం..
మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఆశించిన సీట్లు గెలవలేకపోవచ్చు. కానీ ఏకంగా 1.30 లక్షల ప్రజా ఓట్లను సాధించింది. ఇక ప్రాదేశిక పోరులో.. మొత్తం 6,86,762 ఓట్లు పోలైతే.. ఇందులో టీడీపీకి 3,45,873 ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌ సీపీకి 2,85,704 ఓట్లు వచ్చాయి. అంటే 60,169 ఓట్లు మాత్రమే టీడీపీ ఆధిక్యం సాధించింది. కుట్రలు–కుతంత్రాలు.. గూండాగిరి–రౌడీయిజం మధ్య నాలుగు జెడ్పీటీసీలతో పాటు మూడు మండలాధ్యక్ష స్థానాలను వైఎస్సార్‌ సీపీ గెలుకున్న విషయం తెలిసిందే.

ఇవి అంకెలు కావు 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం ఎలా ఉంటుందో ముందే చెబుతున్న ఓ శ్యాంపిల్‌. చంద్రబాబు నాయుడు రాజకీయ పతనం కుప్పంలో ఫ్యాన్‌ సృష్టించిన సునామీ నుంచి ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ సైతం ఇదే ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయడానికి ఉరకలేస్తోంది.

ఇదీ చదవండి: బాబు మార్క్‌ రాక్షస క్రీడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement