ఎస్సై పోస్టులు 378.. కానిస్టేబుల్, ఇతర పోస్టులు 1,156
నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు.. డిసెంబర్ 16 చివరి గడువు
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలోని పలు విభాగాల్లో 1,534 పోస్టుల భర్తీకి ఏపీ రాష్టస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టులు, 1,156 పోలీసు కానిస్టేబుల్, ఇతర విభాగాల పోస్టులు ఉన్నాయి. ఎస్సై విభాగంలో సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు) పోస్టులు 253, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఆర్) 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో పురుష ఎస్సై పోస్టులు 9 ఉన్నాయి.
పోలీసు కానిస్టేబుల్ (సివిల్) పోస్టులు 542, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 285, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ పోస్టులు 158, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో పురుష వార్డర్లు 150, మహిళా వార్డర్లు 21 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1,156 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 27 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జనవరి 31న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 28న పరీక్ష ఉంటుంది. ఎస్సై పోస్టులకు పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఎస్సై (పీటీవో, కమ్యూనికేషన్), ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు, పోలీసు కానిస్టేబుల్ (కమ్యూనికేషన్), కానిస్టేబుల్ (డ్రైవర్, మెకానిక్), డ్రైవర్ ఆపరేటర్ (ఎస్డీఆర్‌ఎఫ్‌ఎస్) పోస్టులకు దరఖాస్తుల తేదీలు, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.


