3,240 గ్రామ పంచాయతీల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు.. వెనువెంటనే ఫలితాల వెల్లడి
పల్నాడు జిల్లా వెల్లటూరు.. సత్యసాయి జిల్లా కనగానపల్లిలో ఒక్కో వార్డుకు రీ పోలింగ్
సాక్షి, అమరావతి: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన 3,240 గ్రామ పంచాయతీల్లో రెండు చోట్ల ఓట్ల లెక్కింపు వాయిదా పడినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసిన అనంతరం అప్పటికప్పుడే రెండు గంటల నుంచి ఆ ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉండగా.. పల్నాడు జిల్లా వెల్లటూరు గ్రామ పంచాయతీలో, సత్యసాయి జిల్లా కనగానపల్లి గ్రామ పంచాయతీలో రీ పోలింగ్ కారణంగా ఓట్ల లెక్కింపును నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల అక్రమాల కారణంగా వెల్లటూరు పంచాయతీలో ఒకటో వార్డు, కనగానపల్లి పంచాయతీలో ఏడో వార్డులో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. దీంతో శుక్రవారం ఆయా వార్డుల్లో రీ పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి.. మిగిలిన వార్డులతో పాటు సర్పంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ జరిగిన మిగిలిన 3,238 గ్రామ పంచాయతీల్లోనూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టారు.
ఫలితం అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా చేపట్టారు కాగా, తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన 3240 గ్రామ పంచాయతీల్లో మొత్తం 74,45,583 మంది ఓటర్లు ఉండగా, ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఓంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియలో 77.65 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
18 జిల్లాల్లో 44 ఘటనలు
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గురువారం పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్, 23 మున్సిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికలకు పటిష్ట బందోబస్తు కల్పించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నిలకు సంబంధించిన ఘటనలపై గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,380 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి తదితర 18 జిల్లాల్లో మొత్తంగా 44 ఘటనలు చోటుచేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఎన్నికల భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు.


