రాయలసీమ లిఫ్ట్‌ కొత్త ప్రాజెక్టు కాదు | Former CM YS Jagan reveals the facts regarding the Rayalaseema Lift Irrigation Scheme | Sakshi
Sakshi News home page

రాయలసీమ లిఫ్ట్‌ కొత్త ప్రాజెక్టు కాదు

Nov 27 2026 5:04 AM | Updated on Nov 27 2026 5:04 AM

Former CM YS Jagan reveals the facts regarding the Rayalaseema Lift Irrigation Scheme

సీమ ఎత్తిపోతల పథకంపై వాస్తవాలను బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

కేటాయించిన జలాలనే సమర్థంగా వాడుకునేందుకు ఓ ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం 

రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌పై తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది  

దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబు హాట్‌ లైన్‌లో కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాల కోసం మౌనం దాల్చారు

కరువు విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని వాడుకునే అవకాశాన్ని దెబ్బతీశారు.. రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరి వేశాడు.. 

బాబు అధికారంలోకి రాగానే.. జగన్‌కు పేరు వస్తుందని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఆపేశారు 

సీమ లిఫ్ట్‌కు అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, అదనపు రిజర్వాయర్లు, అదనపు ఆయకట్టూ లేదు 

అదే కృష్ణా నది.. అవే నీళ్లు.. అవే కేటాయింపులు.. నీటి కేటాయింపులున్నా వాడుకునే అవకాశం లేకుంటే ఏం లాభం? 

ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు నీటిని చేరవేయటమే ఈ పథకం ఉద్దేశం  

సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌పై తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరి కాదని స్పష్టంచేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబు హాట్‌లైన్‌లో కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాల కోసం మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీమ లిఫ్ట్‌ స్కీమ్‌పై వాస్తవాలను వివరిస్తూ వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఖాతాలో గురువారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..  

కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గిపోతున్నాయి... 
మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ కొత్త ప్రాజెక్టు కాదు. దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు. అదే.. కృష్ణానది.. అవే నీళ్లు.. అవే కేటాయింపులు.. అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా.. దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన.. అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణా నది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. 

నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం.. 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో అంటే 44 వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లేపంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు పాలమూరు రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ.. మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది.  

ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టాం.. 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో.. లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా.. వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ను భూతద్దంలో చూపించడం భావ్యమా?  

సీమ ప్రజల ప్రాణాధారానికే బాబు ఉరి వేశాడు.. 
దురదృష్టవశాత్తూ.. దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరు వస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తి చేయాల్సింది పోయి.. ఎవరైనా అభ్యంతరం చెబితే దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి.. హాట్‌­­లైన్‌ రాజకీయాల కోసం బలి పెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లో, హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరి వేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement