బాబు మార్క్‌ రాక్షస క్రీడ | TDP rigging in Panchayat elections too | Sakshi
Sakshi News home page

బాబు మార్క్‌ రాక్షస క్రీడ

Nov 27 2026 4:55 AM | Updated on Nov 27 2026 4:58 AM

TDP rigging in Panchayat elections too

నంద్యాల జిల్లా అహోబిలంలో మహిళను కారుతో తొక్కించేసిన టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ , కాలు విరిగిపోయి.. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి మోసుకెళ్తున్న స్థానికులు

 రాజ్యాంగ దినోత్సవం రోజునే దౌర్జన్యకాండ    

పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ పార్టీ విచ్చలవిడిగా రిగ్గింగ్‌

అధికార పార్టీ నేతలకు అడుగడుగునా అండగా నిలిచిన పోలీసులు 

ఏజెంట్లపై దాడులు.. రిగ్గింగ్‌.. దొంగ ఓట్లు.. బ్యాలెట్‌ పత్రాల చోరీ

పోలింగ్‌ కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలను బలవంతంగా బయటకు పంపిన వైనం  

పలుచోట్ల హింసాత్మక ఘటనలు.. ఆస్పత్రుల పాలైన బాధితులు 

అహోబిలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై కారు ఎక్కించిన ఎమ్మెల్యే అఖిలప్రియ  

రాయలసీమ జిల్లాల్లో రెచి్చపోయిన పచ్చ మూకలు  

వైఎస్సార్‌సీపీ మద్దతు దారులకు మెజార్టీ వస్తున్న చోటల్లా గొడవలు 

రీకౌంటింగ్‌ చేయాలంటూ పట్టు.. సహకరిస్తున్న అధికారులు 

పలు గ్రామ పంచాయతీల్లో ఓడిపోయిన వారు గెలిచినట్లు ప్రకటన

ఇది రాక్షస క్రీడ... ఇది ముమ్మాటికీ అధికార అహంకారంతో కళ్లు మూసుకుపోయి పచ్చని పల్లెల్లో నెత్తుటి ఏరులు పారిస్తున్న పచ్చ మూకల వికృత క్రీడ! కుప్పం మండలం వానగుట్టపల్లిలో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్‌ ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా, కారుతో తొక్కించి వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజేంద్ర ప్రాణాలు తీయడం అరాచక పాలనకు పరాకాష్ట. కుప్పం గడ్డపై చిందిన కార్యకర్త రక్తపు మరకలు ఆరకముందే, పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలోనూ అమాయక మహిళలపైకి వాహనాలను దూకించి అయిదుగురిని తీవ్రంగా గాయపరచడం అమానుషం. రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ అరాచక పరంపర కన్నవారికి కడుపుకోతను, నమ్ముకున్న కుటుంబానికి తీరని శోకాన్ని... ప్రజాస్వామ్యవాదుల్లో ఎనలేని ఆగ్రహాన్ని రగిలిస్తోంది.

సకల దుర్మార్గాలకూ తెరలేపి స్థానిక ఎన్నికలను అధికార పక్షం ఎప్పుడో హైజాక్‌ చేసింది. ఇంతటి టీడీపీ ఆగడాల నడుమ రాష్ట్రంలో ఏదో మూల ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లేసి బ్యాలెట్‌ ద్వారా కూటమికి చెంపదెబ్బ లాంటి తీర్పు ఇస్తే దాన్ని కూడా బాంబులతో, బుల్లెట్లతో తగలబెట్టాలని చూడటం... కారు చక్రాల కింద కర్కశంగా తొక్కి చంపేందుకు ప్రయత్నించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతోంది. బ్యాలెట్‌ ద్వారా ప్రజలిచ్చిన తీర్పును భౌతిక దాడులతో అడ్డుకునే దమనకాండను, రక్తసిక్త పరంపరను రాష్ట్ర ప్రజ తీవ్రంగా అసహ్యించుకుంటోంది... అధికారం మత్తులో కళ్లుమూసుకుపోయి పల్లెసీమల ప్రశాంతతను చిదిమేస్తున్న కూటమి పార్టీలు ఏనాటికైనా ఇంతకు ఇంతా మూల్యం చెల్లించుకోక తప్పదని శాపం పెడుతోంది.  

సాక్షి, అమరావతి: ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో బెంబేలెత్తిపోతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గురువారం జరిగిన గ్రామ పంచాయతీ, కొన్ని మున్సిపల్‌ స్థానాల ఎన్నికల్లోనూ బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, రిగ్గింగ్, దొంగ ఓట్లు, పోలింగ్‌ ఏజెంట్లపై దాడులతో అనేక ప్రాంతాలు అట్టుడికాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి అధికార పార్టీ నేతల అనుచరులు చొరబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. లోపల టీడీపీ ఏజెంట్లు, కార్యకర్తలు రిగ్గింగ్‌ చేస్తే.. పోలింగ్‌ కేంద్రాల బయట పోలీసులు కాపలా కాశారు. ఓటర్ల చేతిలో స్లిప్పులను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు. అడ్డుకున్న ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 

మరో వైపు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపడం, గృహ నిర్బంధాలు, అరెస్టులతో ఎన్నికల ప్రక్రియలో పోలీసులు ఏకపక్ష వైఖరి ప్రదర్శించారు. పలుచోట్ల బ్యాలెట్‌ పత్రాలు అపహరించడంతో కలకలం రేగింది. అనేక చోట్ల టీడీపీ మూకల దాడులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. నంద్యాల జిల్లా అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వైఎస్సార్‌సీపీ మద్దతు దారులపైకి ఏకంగా కారు ఎక్కించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. 

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో వీరంగం సృష్టిస్తున్న టీడీపీ రౌడీ మూకలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు 

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు చొరబడ్డారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తులు స్థానిక ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలోకి రావడంపై స్థానికులు, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరులోనూ బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే అక్రమాలు జరుగుతున్నాయని గ్రామస్తులు నిలదీయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

అనంతలో అరాచకం 
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లిలో నిబంధనల ప్రకారం ఓట్లు లెక్కించాలని కోరినందుకు దళితుడైన  వైఎస్సార్‌సీపీ కార్యకర్త మీసాల ధనుంజయపై టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నకేశవులు దాడి చేసి గాయపరిచాడు. ఆగ్రహించిన దళితులు  కౌంటింగ్‌ కేంద్రం వద్ద రెండు గంటల పాటు ధర్నా చేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కురబ సన్నప్ప 76 ఓట్ల మెజార్టీతో రీకౌంటింగ్‌లో గెలిచినా అధికారులు డిక్లరేషన్‌ ఇవ్వకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. దీన్ని ప్రశ్నించిన పార్టీ నేత మల్లికార్జునను పోలీసులు చితకబాదారు. 

కుందుర్పి మండలం మహంతపురంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి మంజుళ 204 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు టీడీపీ మద్దతుదారు 26 ఓట్లతో గెలుపొందినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు. తూముకుంటలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి సవితమ్మకు రీకౌంటింగ్‌లోనూ మెజార్టీ వచ్చినప్పటికీ  డిక్లరేషన్‌ ఇవ్వలేదు. శెట్టూరు మండలం మాకొడికిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపు ఖాయం కావడంతో టీడీపీ గూండాలు కౌంటింగ్‌ కేంద్రంలోకి చొరబడి బ్యాలెట్‌ బాక్సులోకి ఇంకు పోశారు. బ్యాలెట్‌ పేపర్లను ఎత్తుకెళ్లారు. అనంతపురం రూరల్‌ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ నాయకులు భారీఎత్తున సైక్లింగ్, రిగ్గింగ్‌ చేశారు. 

తిరుపతి జిల్లా మంగంపేటలో దాడికి తెగబడుతున్న టీడీపీ మూకలు  

అనంతపురం రూరల్‌ మండలం కట్టకిందపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు బోనగిరి చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రాప్తాడు నియోజకవర్గంలోని కోనాపురం, పాతపాళ్యం, నరసంపల్లి, తగరకుంట, నాగసముద్రం గ్రామాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. రామగిరి, కనగానపల్లి మండలాల్లో ఏజెంట్లను బయటకు పంపి వెన్నుపోటు పార్టీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. దీంతో ఆగ్రహించిన ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి పోలింగ్‌ కేంద్రంలో 250 బ్యాలెట్‌ పత్రాలను టీడీపీ నేతలు ఎత్తుకెళ్లారు.   

అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ పోలీసు వాహనంపైకి ఎక్కి నినదిస్తున్న మహిళలు   

వైఎస్సార్‌సీపీ వాళ్లు గెలిస్తే రీకౌంటింగ్‌ 
వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో నలుగురు సర్పంచ్, 10 వార్డుల అభ్యర్థులను ఇప్పటికే పోటీ నుంచి తప్పించగా.. మిగతా 10 మందిని (11–20 వార్డులు) తప్పుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కొండారెడ్డి బెదిరించడంతో వారు ఊరు విడిచి క్యాంపునకు వెళ్లారు. బి.కోడూరు మండలం పెద్దుళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు సిద్దమూర్తి లక్ష్మీదేవి 11 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఆర్‌ఓ ప్రకటించారు. దీంతో కూటమి నేతలు అడ్డుకుని రీకౌంటింగ్‌ చేయాలంటూ ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది.  

బద్వేలు మండలం కోనసముద్రం పంచాయతీలోని ఎల్లుగారిపల్లె కౌంటింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారురాలు చిన్నక్కకు ఆధిక్యం వస్తుండటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లదాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో గొల్లపల్లి బుజ్జిబాబు అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో దళిత మహిళా అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొందరిని బలవంతంగా జీపులో ఎక్కించి తీసుకెళ్లారు. 

రౌతుకుంటలో అభ్యర్థి కనిపించడం లేదని ప్రశ్నించిన గ్రామస్తుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. శెట్టిపల్లిలో మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి అరెస్టును నిరసిస్తూ స్థానికులు తిరగబడ్డారు. ఎస్సీ రిజర్వుడ్‌ సర్పంచ్‌ స్థానంలో బీసీ అభ్యర్థిని టీడీపీ మద్దతుదారుడిగా బరిలోకి దించారంటూ సంబేపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరించారు. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లెలో గంజికుంట రెవెన్యూ పొలంలోని 3.20 ఎకరాలను కొండమ్మ కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పంటలను సాగు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న లెక్కల శివప్రసాద్‌రెడ్డి వెంట కొండమ్మ కుమారుడు జనార్ధన్‌ రెడ్డి తిరుగుతున్నాడనే అక్కసుతో బుధవారం కొండమ్మ సాగు చేసిన మినుము పంటను టిల్లర్‌ యంత్రంతో ధ్వంసం చేశారు.   

జొన్నలగడ్డలో ఓటర్ల ఆందోళన 
నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, కూటమి కార్యకర్తలు తమను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్ల చేతుల్లోని స్లిప్పులను టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నా పోలీసులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీకి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు అక్కడి డీఎస్పీ, సీఐలపై తిరగబడ్డారు.


పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓటర్లను తరిమితరిమి కొడుతున్న పోలీసులు   

మంత్రి సత్యకుమార్‌ పీఏ హల్‌చల్‌ 
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లోని పంచాయతీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో టీడీపీ గూండాలు రామగిరి, కనగానపల్లి మండలాల్లో రెచ్చిపోయారు. కోనాపురం, పాతపాళ్యం, నరసంపల్లి పోలింగ్‌ కేంద్రాల్లో  వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఏజెంట్లుగా ఉన్న వారిని దౌర్జన్యంగా బయటకు పంపి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తగరకుంటలో వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్ధి భర్తపై టీడీపీ గూండాలు దాడి చేశారు.

అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు  

ధర్మవరం మండలం గొట్లూరు పోలింగ్‌ కేంద్రం వద్ద మంత్రి సత్యకుమార్‌ పీఏ హరీష్‌ బాబు హల్‌చల్‌ చేశాడు. కనగానపల్లిలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు ప్రయత్నించగా.. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, ఏజెంట్లు ఎదురు తిరగటంతో గొడవకు దారి తీసింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ ప్రత్యేక పోలీస్‌ బలగాలతో వచ్చి టీడీపీ అల్లరి మూకలను చెదరగొట్టారు. అయితే టీడీపీ రౌడీలు దూరంగా వెళ్లి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఎస్పీతో పాటు కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.  కాగా, అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భాస్కర్, మల్లమ్మలకు చెందిన గడ్డివామికి కక్ష పూరితంగా నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల విలువైన పశుగ్రాసం దగ్ధమైంది.   

                మార్కాపురం జిల్లా పొదిలిలో ఎస్సీ మహిళపై కొనకనమిట్ల ఎస్‌ఐ శ్రీకాంత్‌  దాడి  

రెచ్చిపోయిన కూటమి నేతలు   
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట పంచాయతీలో కూటమి నాయకులు గంజాయి మూకలతో వచ్చి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అడ్డువచ్చిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన పోలింగ్‌ ఏజెంట్లను కొట్టి బయటకు గెంటేశారు. పుల్లంపేట మండలం టి.కమ్మపల్లి 1,2,3 పోలింగ్‌ బూత్‌లలోకి ఓటర్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు పంచాయతీలో పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా నామినేషన్‌ ఉపసంహరించుకున్న అభ్యర్థి పేరుతో గుర్తు కేటాయించారు.  

                            తిరుపతి జిల్లా మంగంపేటలో టీడీపీ మూకల వీరంగం   

పచ్చ మూకలకే పోలీసుల మద్దతు 
పొదిలి నగర పంచాయతీలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు, జెడ్పీ చైర్మన్‌ కందుల రామిరెడ్డి కుమారుడు కందుల రోహిత్‌రెడ్డి రౌడీ మూకలతో వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడటంతోపాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. పొదిలి మున్సిపాలిటీ నందిపాలెం పోలింగ్‌ బూత్‌లో జెడ్పీ చైర్మన్‌ కుమారుడి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకున్న మహిళలపై కొనకనమిట్ల ఎస్సై విచక్షణా రహితంగా దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ పోలింగ్‌ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను వీడియో తీయించినా అధికారులు పట్టించుకోలేదు. 

నంద్యాల జిల్లా కానాల గ్రామంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభపెడుతూ ప్రచారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌ యాదవ్‌ను పోలీసులు బలవంతంగా బయటకు తరలించడాన్ని గ్రామ­స్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నెట్టేశారు. పొన్నూరులో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షేక్‌ నాజని, పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాజర్‌ ఇళ్లకు అర్ధరాత్రి భారీగా పోలీసులు వెళ్లి హడావుడి చేశారు.   

నంద్యాల జిల్లా అహోబిలంలో కర్రలు, రాడ్లతో పచ్చ మూకల వీరంగం 

» నరసరావుపేటలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పోలీసులతో బయటకు గెంటి వేశారు. 40 వార్డుల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సాక్షి బాపట్ల టీవీ రిపోర్టర్‌ వి రాఘవేంద్రరావుపై టీడీపీ, బీజేపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ మద్దతుదారులు బూత్‌లలోకి వెళ్లి ప్రచారం చేస్తుండటాన్ని చిత్రీకరిస్తుండగా దాడికి పాల్పడ్డారు.  
»  తాడేపల్లి పట్టణ పరిధిలోని గుడ్‌న్యూస్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన బూత్‌లలో మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడైన ముమ్మిడి సత్యనారాయణ బూత్‌ల్లోకి రావడంపై వైఎస్సార్‌ సీపీ కార్పొరేషన్‌ ఎన్నికల చీఫ్‌ ఏజెంట్, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఎన్నికల చీఫ్‌ ఏజెంట్‌ దొంతిరెడ్డి వేమారెడ్డిని బలవంతంగా బయటకు పంపిచారు.   


      గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిపై పోలీసుజులుం 

»  పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం, వినుకొండ మండలాల్లో టీడీపీ మూకలు రిగ్గింగ్, గూండాగిరీకి తెగబడ్డారు.  ప్రతిపక్ష మద్దతుదారులు, ఓటర్లపై జులుం ప్రదర్శించారు.  

ప్రతిపక్ష నేతల గృహ నిర్బంధం 
ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కళ్యాణదుర్గం మాజీ ఎంపీ, నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యను హౌస్‌ అరెస్టు చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అర్ధరాత్రి హౌస్‌ అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో మాజీ జెడ్పీటీసీ గోర్ల ఉపేంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

తాడేపల్లిలో పోలీసులు వైఎస్సార్‌సీపీ మంగళగిరి మాజీ ఇన్‌చార్జి వేమారెడ్డిని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ఆయన మేయర్‌ అభ్యర్థి చీఫ్‌ ఏజెంట్‌గా ఉన్నారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను వీడియోలు తీయొద్దంటూ పోలీసులు బెదిరించారు. కృష్ణా జిల్లా గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోగా పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కార్పొరేటర్‌ అభ్యర్థి భర్తను అరెస్టు చేయడంపై మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ నిరసనకు దిగారు.

ఏజెంట్లపై దాడులు.. రక్తమోడిన పోలింగ్‌.. 
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లు, అభ్యర్థులపై పచ్చ గూండాలు దాడులకు తెగబడటంతో పోలింగ్‌ కేంద్రాలు రక్తమోడాయి. ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ వెల్ది రాంబాబుపై టీడీపీ నేత కేసుబాబు, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడేందుకు టీడీపీ మూకలు విఫలయత్నం చేశాయి.

వెల్లటూరులో దొంగ ఓట్లు వేయించడానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వంద మందిని వినుకొండ నుంచి పంపారు. భారీ స్థాయిలో వచ్చిన టీడీపీ రౌడీలు కర్రలతో హల్‌చల్‌ చేశారు. కాగా, దొంగ ఓటు వేయడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన వినుకొండ వ్యక్తికి ఓటర్లు దేహశుద్ధి చేశారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పోలవరం పంచాయతీలోని కలగట్ల పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రౌడీలు పోలీసుల సమక్షంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తలుపులు వేసి మరీ దొంగ ఓట్లు వేసుకుంటుండగా, ఎస్సై జీ సందీప్‌ కుమార్‌ గేటుగా అడ్డంగా నిలబడి కాపు కాయడం తీవ్ర విమర్శలపాలైంది.  

రాజాంలో డీఎస్పీ ఓవర్‌ యాక్షన్‌  
విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్‌ అత్యుత్సాహం పెద్ద వివాదానికి దారితీసింది. రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 7వ వార్డు పోలింగ్‌ సరళిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ పర్యవేక్షించారు. ఆ సమయంలో బెల్లానను ఆ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త పొట్నూరు లక్ష్మణరావు దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడి నుంచి బెల్లాన బయటకు వచ్చేశారు. 

పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులను జాగ్రత్తగా స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించే కార్యక్రమం అధికారులు చేపట్టారు. బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌కు చేరేవరకూ వాటి వెంట ఉండాలని ఏజెంట్లుకు సూచించడంతో పాటు బెల్లాన కూడా పోలింగ్‌ కేంద్రం బయట కార్యకర్తలతో కలిసి నిరీక్షించారు. తనపై దాడిచేసేందుకే బెల్లాన బయట ఉన్నారని టీడీపీ కార్యకర్త లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి డీఎస్పీ రాఘవులు, రాజాం పట్టణ సీఐ నవీన్‌కుమార్, ప్రత్యేక పోలీస్‌ బలగాలకు చెందిన 50 మంది కానిస్టేబుళ్లు చేరుకున్నారు. 

            విజయనగరం జిల్లా రాజాంలో బెల్లాన చంద్రశేఖర్‌పై పోలీసుల దౌర్జన్యం  

బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు అతని కుమారుడు బెల్లాన వంశీకృష్ణను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. పోలింగ్‌ బూత్‌లు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించే వరకు ఉంటామని చెప్పినా వినకుండా ప్రత్యేక బలగాలతో అక్కడున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, అభిమానులపై లాఠీచార్జి చేశారు. డీఎస్పీ రాఘవులు బెల్లాన చంద్రశేఖర్‌పై విరుచుకుపడ్డారు. రెండుచేతులతో నెట్టుతూ పోలీస్‌ జీపులోకి బలవంతంగా తోసి, రాజాం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాల్చి పడేస్తానంటూ సీఐ నవీన్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై బెదిరింపులకు దిగారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement