మళ్లీ అవే అరాచకాలు మీరు గెలవాలనుకుంటున్నది ఇలాగేనా చంద్రబాబూ?
నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్
ఓటర్లకు చంపేస్తామంటూ బెదిరింపులు
పోలింగ్ ఏజెంట్లపై దాడులు.. బ్యాలెట్ పత్రాల చోరీ
పోలీసుల అండతోనే రిగ్గింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికలు.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ కూటమి నేతలు బరి తెగించి అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఓటర్లను బెదిరించడం.. పోలింగ్ ఏజెంట్లపై దాడులు.. బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
పోలీసుల సహకారంతోనే భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని స్పష్టంచేశారు. ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటున్నది ఇలాగేనా చంద్రబాబూ..? అని నిలదీశారు. అక్రమాలు జరిగిన ప్రతి చోటా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తన పాలనలో జరిగిన దారుణాలకు చంద్రబాబు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గురువారం తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే...
చంద్రబాబూ..! సిగ్గనిపించటం లేదా?
ఓటర్లను చంపుతామంటూ మళ్లీ బెదిరింపులు... పోలింగ్ ఏజెంట్లపై మళ్లీ దాడులు.. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డగింతలు... పోలింగ్ కేంద్రాల నుంచి మళ్లీ బ్యాలెట్ పత్రాల చోరీ... పోలీసుల సహకారంతో మళ్లీ యథేచ్ఛగా రిగ్గింగ్... చంద్రబాబు గారూ! మీ ప్రభుత్వ హయాంలో ఈ రోజు జరిగిన ఘటనలకు మీకు సిగ్గనిపించడం లేదా? రెండో విడత మున్సిపల్ ఎన్నికలు, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులను, ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులను, అభ్యర్థులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మీ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది. ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటున్నది ఇలాగేనా?
దాడులు.. దొంగ ఓట్లు.. బ్యాలెట్ పత్రాల చోరీ
ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని ఒక వాహనం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగంపేటలో కూటమి మద్దతుదారులు పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి ఒక ఏజెంట్ చేయి విరగ్గొట్టారు. ప్రసన్నాయనపల్లిలో టీడీపీ నాయకులు అధికారులను బెదిరించి బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు. నరసంపల్లిలో ఇద్దరు వ్యక్తులు బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయడంతో రెండు వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. వెల్లటూరులో టీడీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం తలుపులు మూసేసి పోలీసుల కళ్లెదుటే బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో పట్టపగలే బహిరంగంగా ఒకే ఓటర్లను వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు తిప్పుతూ ఓట్లు వేయించారు.
ఓటర్లకు బెదిరింపులు..
రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకులను అపహరించడం, గృహనిర్బంధం చేయడం ద్వారా ఎన్నికలకు దూరంగా ఉంచారు. పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేశారు. వారి నియామక పత్రాలను చించేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఓటర్లను బెదిరించారు. టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను స్వాదీనం చేసుకుని బహిరంగంగానే నకిలీ ఓటరు కార్డులను ఉపయోగించారు. ఓటర్ల వేళ్లపై సిరా గుర్తులను చెరిపేశారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలను వీడియో తీసిన వారిపై దాడులు చేసి వారి సెల్‌ఫోన్లను లాక్కున్నారు, ధ్వంసం చేశారు.
ఈ దారుణాలకు మీరు సమాధానం చెప్పక తప్పదు..
చంద్రబాబు గారూ..! ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకూ ఎలాంటి భయం లేకుండా తన ఓటును వినియోగించుకునే హక్కు ఉంది. మీరు బెదిరించిన ప్రతి ఓటరుకు, దాడికి గురైన ప్రతి పోలింగ్ ఏజెంట్‌కు, చోరీకి గురైన ప్రతి బ్యాలెట్ పత్రానికి మీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. బాధితులకు న్యాయం చేయాలని, ఎన్నికల అక్రమాలు జరిగిన ప్రతి చోటా రీపోలింగ్ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన టీడీపీ నాయకులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంది. మీ పాలనలో జరిగిన ఈ దారుణాలకు మీరు సమాధానం చెప్పక తప్పదు. సీబీఎన్ జంగిల్ రాజ్!!


