బూత్‌ నుంచి కౌంటింగ్‌ దాకా.. 'అరాచకమే'! | Tdp Threats to officials at polling booths | Sakshi
Sakshi News home page

బూత్‌ నుంచి కౌంటింగ్‌ దాకా.. 'అరాచకమే'!

Nov 27 2026 5:25 AM | Updated on Nov 27 2026 5:25 AM

Tdp Threats to officials at polling booths

పార్టీ రహిత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం

పోలింగ్‌ బూత్‌లలో హంగామా.. అధికారులకు బెదిరింపులు.. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తొక్కించుకుంటూ వెళ్లిన అఖిలప్రియ కాన్వాయ్‌ 

ఓటమి భయంతో ఎమ్మెల్యేల ఫోన్లు.. ఫలితాలు మార్చాలంటూ ఆర్వో, ఈవోలపై ఒత్తిళ్లు

వాహనం కింద ఇరుక్కుపోయిన మహిళ.. తీవ్ర ఉద్రిక్తత 

ఓడిన చోట రీకౌంటింగ్‌ ఒత్తిళ్లు.. అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు

పోలింగ్‌ కేంద్రం గేట్లకు తాళాలు వేయించిన మంత్రి పీఏ 

ఎమ్మెల్యేలకు రెడ్‌ కార్పెట్‌.. మాజీ ఎమ్మెల్యేలకు పోలీసుల గెంటివేత

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ కావాల్సింది పోయి టీడీపీ ఎమ్మెల్యేల అధికార దాహానికి, ఆధిపత్య ప్రదర్శనకు వేది­కగా మారాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి నేరుగా చొర­బడి అధికారులకు ఆదేశాలివ్వడం నుంచి, కౌంటింగ్‌­లో జోక్యం చేసుకుని ఫలితాలను తారుమారు చేయాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం వరకు ఎమ్మెల్యేలు సా­గించిన పెత్తనానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓడిపోయిన చోట రీకౌంటింగ్‌ పేరుతో అధికా­రులపై ఒత్తిళ్లు.. పోటీ చేసిన అభ్యర్థులకే పోలింగ్‌ కేంద్రా­ల్లోకి ప్రవేశం నిరాకరణ.. మరోవైపు ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలు, నేతలను బూత్‌ల నుంచి బలవంతంగా బయ­టకు పంపిన పోలీసులు. ఇలా అధికార పార్టీ నేతలకు ఎర్రతివాచీ పరిచి, ప్రతిపక్షానికి అడ్డంకులు సృష్టిస్తూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేశారు. 

బాబు ఆదేశంతో ఎమ్మెల్యేల చేతికి పగ్గాలు 
పంచాయతీ ఎన్నికల్లో యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్న చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు రెచ్చిపోయారు. ఓటమి తమ ఖాతాలో పడకూడదన్న లక్ష్యంతో అధికార దుర్వినియోగానికి దిగారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి కౌంటింగ్‌ హాళ్ల వరకు ప్రతి దశలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. 

బూత్‌లలో చొరబడి ఎమ్మెల్యేల వీరంగం 
గురువారం పోలింగ్‌ రోజు పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే పోలింగ్‌ కేంద్రాల వద్ద హంగామా సృష్టించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ పలు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి అధికారులకు హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా అహోబిలంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య నుంచి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ వాహనం కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేయడం కలకలం రేపింది. స్వయంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిననే విషయాన్ని మరచి వ్యవహరించడమే కాకుండా, ఆ తర్వాత తనపైనే హత్యాయత్నం జరిగిందంటూ ఎదురుదాడికి దిగడం గమనార్హం. అదే నియోజకవర్గంలోని మాయలూరులో ఓటర్లను రెండు గంటల పాటు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. 

పోలింగ్‌ కేంద్రం గేటుకు తాళం వేయించిన మంత్రి పీఏ 
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లెలో దళిత మహిళా సర్పంచ్‌ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, ఆమె ఏజెంట్లను పోలీసులు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పీఏ సమక్షంలో పోలింగ్‌ కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేయడం, అభ్యర్థులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం అధికార దుర్వినియోగం ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. పోటీలో ఉన్న అభ్యర్థికే పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశం లేకపోవడం ఎన్నికల నిర్వహణలోని వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఫలితాలు మార్చాలంటూ ఒత్తిళ్లు
పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల జోక్యం మరింత పెరిగింది. విజయవాడ రూరల్‌ పరిధిలోని నున్నలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపించడంతో ఫలితం ప్రతికూలంగా వస్తే తారుమారు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆర్వో, ఈవోలకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వగ్రామం అచ్చంపేటలోనూ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి 32 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఎమ్మెల్యే సొంతూరిలోనే ఓటమిని జీర్ణించుకోలేని కూటమి నేతలు రీకౌంటింగ్‌ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసి విధుల నుంచి తప్పించారు.

ఎమ్మెల్యేలకు ఎర్ర తివాచీ.. మాజీలకు గెంటివేత
అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్‌ కేంద్రాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. అదే ప్రతిపక్ష నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిని పోలింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను అరెస్టు చేయడంతో పాటు మరికొన్ని వార్డుల్లో ఏజెంట్లను బయటకు పంపించారు. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బూత్‌లలో తిరిగే స్వేచ్ఛ.. మరోవైపు ప్రతిపక్ష నేతలకు గెంటివేతలు, ఏజెంట్లకు అరెస్టులు. ఈ ద్వంద్వ వైఖరి పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత ధోరణిపై తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement