రూ.207.60 కోట్ల విలువైన 46 ఆభరణాలను సమరి్పంచిన చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు
రూ.207.60 కోట్ల విలువైన 46 ఆభరణాలను సమర్పించిన చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు
రంగనాయకుల మండపంలో ప్రదర్శన.. మరో 15 కిలోల బంగారంతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారీ
తొలుత దాత కుటుంబ సభ్యులు ఆభరణాల పళ్లేలతో ఒక్కొక్కరుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు
తిరుమల: తిరుమల శ్రీవారి చరిత్రలో చారిత్రాత్మక విరాళంగా నిలిచేలా చెన్నైకి చెందిన దాతలు వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207.60 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ విరాళం అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం దాత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో ప్రదర్శించిన 46 బంగారు ఆభరణాలను సీఎం వీక్షించి, దాతల ఉదారతను అభినందించారు.
అనంతరం.. దాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు తలపై ఆభరణాల పళ్లెంలను ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, శ్రీవారి సన్నిధికి చేరుకుని స్వామివారి ఎదుట ఆభరణాలను సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు డాక్టర్ శరత్, గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
సేవలోనే నిజమైన ఆనందం..
అనంతరం.. దాతలైన జైన్ దంపతులతో కలిసి చంద్రబాబు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవాభావమే మనిషికి అసలైన సంతృప్తి, సంతోషాని్నస్తాయన్నారు. ప్రపంచంలో ఎంతోమంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారని.. కానీ, సంపాదించిన సంపదను సద్వినియోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. ఆ కోవలోనే నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్న చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శంగా ఉన్నారని కొనియాడారు.

దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించామని జైన్ దంపతులు చెప్పడం వారి భక్తికి నిదర్శనమన్నారు. జైన్ దంపతుల తరహాలోనే ఇతర సంపన్నులు కూడా ముందుకొచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామని.. విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలుత సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆభరణాల వివరాలు..
మొత్తం బంగారం : 121 కిలోలు (24 క్యారెట్లు)
మొత్తం ఆభరణాలు : 46 – ఆభరణాల రకాలు : 33
ఆభరణాల తయారీ ఖర్చులతో కలిపి మొత్తం విలువ : రూ.207.60 కోట్లు
శ్రీవారి ఆభరణాలకు వినియోగించిన బంగారం : 106 కిలోలు (24 క్యారెట్లు)
మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారుచేయనున్నారు.


