రోడ్డుపై బైఠాయించిన జనసేన నేతలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై బైఠాయించిన జనసేన నేతలు

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

మంగంపేట పంచాయతీలో

బరితెగించిన టీడీపీ గుండాలు

వైఎస్సార్సీపీ నేతలపై భౌతిక దాడులు.. పలువురికి తీవ్ర గాయాలు

పుల్లంపేట మండలం టి.కమ్మపల్లిలో పోలింగ్‌ ఏజెంట్లను రానివ్వని టీడీపీ నేతలు

నిరసనగా రోడ్డుపై బైఠాయించిన

జనసేన సానుభూతిపరులు

ముక్కావారిపల్లె పోలింగ్‌ బూత్‌లో తిష్టవేసిన టీడీపీ ఇన్‌చార్జి కుటుంబ సభ్యులు

పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అరాచకం సృష్టించారు. ప్రశాంతంగా జరగాల్సిన పల్లె ఎన్నికల్లో రక్తం పారించారు. గంజాయి బ్యాచ్‌తో ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్‌, దొంగ ఓట్లు వేసుకున్నారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన పోలింగ్‌ ఏజెంట్లను కొట్టి బయటకు గెంటేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ అధికారపార్టీ సానుభూతిపరులకు కొమ్ముకాశారు. దీనిపై పల్లె ప్రజలు రగిలిపోయారు.

సాక్షి, తిరుపతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు శ్రుతిమించాయి. ఆఖరుకు కూటమిలోని జనసేన కార్యకర్తలను సైతం ఓటింగ్‌ రాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం చూస్తే పంచాయతీ ఎన్నికలు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 16 మండలాల పరిధిలో జరుగుతున్న 404 పంచాయతీల్లో 136 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా గురువారం 268 స్థానాలకు, మొత్తం 3,684 వార్డులుండగా అందులో 2,139 స్థానాలు ఏకగ్రీవం కాగా 1,545 వార్డులకు పోలింగ్‌ జరిగింది.

పుల్లంపేటలో దళిత నేతపై దాడి

రైల్వేకోడూరు నియోజకవర్గం మంగంపేట పంచాయతీలో గురువారం పోలింగ్‌ సందర్భంగా కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఒకానొక దశలో ఓటమి తప్పదన్న భయంతో మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయంలోని 10, 11 వార్డుల్లోని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఏజెంట్లను దౌర్జన్యంగా కూటమి నాయకులు బయటకు పంపించారు. అనంతరం రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బూతులోని ఏజెంట్లను బయటకు లాగుతుండగా గొడవలయ్యాయి. ఈ గొడవల్లో ఒకరి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మంగంపేట కాలనీలో 8వ వార్డు ఏజెంటు తుమ్ముడు కటిక రవి అనే దళిత యువకుడిపై కూటమి నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. పోలింగ్‌ బూత్‌ బయటే కర్రలు, ప్లాస్టిక్‌ కూర్చీలతో దాడులకు తెగబడ్డారు. ఓటర్లను భయపెట్టి చివరి గంటలో రిగ్గింగ్‌ చేసుకోవాలని పథకం రచించారు. ఓటింగ్‌ ముగిసిన తరువాత వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కౌంటింగ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దారిపొడవునా వందలాది మంది గంజాయి బ్యాచ్‌, టీడీపీ అల్లరిమూకలు కర్రలతో అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పార్టీ సీనియర్‌ నాయకులు గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి కౌంటింగ్‌ కేంద్రానికి బయలుదేరారు. నేతలను కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉన్న కూటమి గూండాలు కర్రలతో అడ్డుకున్నారు. తిరుపతి డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేయడంతో అల్లరి మూకలను చెదరగొట్టి కౌంటింగ్‌ కేంద్రాల్లోకి పంపించారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న భావన కలుగుతోందన్నారు. మరోవైపు ముక్కావారిపల్లె పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం నుంచి తిష్టవేశారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు అడ్డుకున్న పాపాన పోలేదు.

పంచాయతీ ఎన్నికల్లో రెచ్చిపోయిన కూటమి నేతలు

టీడీపీ నేతల దౌర్జన్యాలు వైఎస్సార్‌సీపీ నేతలపైనే కాదు ఏకంగా కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీకీ తప్పలేదు. పుల్లంపేట మండలం టి.కమ్మపల్లి 1, 2, 3 పోలింగ్‌ బూత్‌ల్లోకి జనసేన సానుభూతిపరులైన ఓటర్లు గురువారం ఉదయం రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. కనీసం పోలింగ్‌ ఏజెంట్లను సైతం పోలింగ్‌ బూత్‌ వద్దకు రాకుండా నిలువరించి ఏజెంట్‌ ఫారాలను చింపిపడేశారు. టీడీపీ నేతలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జనసేన నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ నేతలకు సహకరిస్తున్న పోలీసుల తీరును ఎండగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement