తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,873 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,810 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
‘గుండె’గుడిలో మీరే!
– క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు విజయవంతం
తిరుపతి తుడా: శ్రీవారి వైద్య సేవలో భాగంగా తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను స్విమ్స్ వైద బృందం విజయవంతంగా నిర్వహించింది. యూకేకు చెందిన ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ హర్షవర్దన్ నిరాఘాటం ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు విజయవతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ టీటీడీ శ్రీవారి వైద్య సేవలు ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు స్విమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికత్సలు నిర్వహించడం హర్షణీయమన్నారు.
ప్రజాస్వామ్య విలువలు పాటించండి
తిరుపతి అర్బన్: ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆశయాలు, ప్రాథమిక హక్కులను పాటించడం అందరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని(సంవిధాన్ దివాస్) డీఆర్వో నరసింహులతోపాటు ఉద్యోగులతో కలసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఉద్యోగులచేత ప్రతిజ్ఞ చేయించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని, రాజ్యాంగ ప్రాధాన్యత, ముసాయిదా రూపకల్పన, పీఠిక మార్పులు, పౌరుల హక్కులను వివరించారు. అలాగే కలెక్టరేట్‌లో జెడ్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో రమణప్రసాద్ నేతృత్వంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నారు.


