చి'వరి'కి గండమే! | Rainfall below normal for the next 4 months | Sakshi
Sakshi News home page

చి'వరి'కి గండమే!

Nov 27 2026 5:48 AM | Updated on Nov 27 2026 5:48 AM

Rainfall below normal for the next 4 months

రబీ సీజన్‌ అంతా వర్షాభావమే

వచ్చే 4 నెలలు సాధారణం కంటే తక్కువ వర్షాలు

రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు

వర్షాధారంపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఇబ్బంది

వరిసాగుకు నీరు ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన సర్కారు

ఆరుతడి పంటలు సాగు చేయాలని ఉచిత సలహాలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం చేతకాని­త­నం వల్ల రబీ సాగులోనూ రైతులకు తిప్పలు తప్ప­డం లేదు. తీవ్ర కరువుకు తోడు భారీ వర్షాలు, వరుస తుపానులతో రైతులు ఖరీఫ్‌ పంటలపై ఆశలు వదులుకోగా, ప్రభుత్వం రబీసాగుకు నీరు ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. నవంబర్‌లో వరుస తుపా­నుల ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే 26.3 శాతం అధికంగా నమోదైంది. దాదాపు ప్రధా­న రిజర్వాయ­ర్లు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు కూడా ఎగబాకాయని ప్రభుత్వమే ప్రకటించింది. రబీలో సాగునీటికి ఇబ్బంది ఉండదనీ చెప్పింది. ఆచరణలోకి వచ్చేసరికి రబీ సాగుకు నీరివ్వలేమని తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. వరికి బదులు ఆరుత­డి పంటలు వేసుకోవాలని ఉచిత సలహాలు పడేస్తోంది.

ప్రభుత్వం పూటకో మాట 
సాధారణంగా ఖరీఫ్‌లో వర్షాధారం కింద, రబీలో బోర్లు, సాగునీటి వనరుల కింద పంటలు సాగవుతుంటాయి. ఖరీఫ్‌లో సీజన్‌ ఆరంభం నుంచి వర్షాల్లేక రైతులు ఇబ్బంది పడ్డారు. కృష్ణ, గోదావరి డెల్టాలతో పాటు ఉత్తరాంధ్రలో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేసిన  పంటలను వరుస తుపానులు తుడిచిపెట్టేశాయి. దీంతో రైతులు ముందస్తు రబీకి సిద్ధమయ్యారు. అదునుకు విత్తనం సరఫరా చేయకపోయినా, ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసి సాగుకు శ్రీకారం చుట్టారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు మార్చుకోవాలని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. వరి సాగు భారీగా తగ్గించి పప్పులు, నూనెగింజల వైపు మళ్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయిస్తోంది.

ఇప్పటివరకు 10.65 లక్షలకు మించని సాగు
2026–27 రబీ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 53.10 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 70.72 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా, ఇప్పటివరకు 10.65 లక్షల ఎకరాలకు మించి సాగు కాలేదు. రబీలో ప్రధానంగా వరి తర్వాత ఎక్కువగా శనగ, మొక్కజొన్న, అపరాలు సాగు చేస్తారు. ఇప్పటి వరకు అత్యధికంగా శనగ ఒక్కటే 3.6 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగిలిన పంటల సాగు అడుగు ముందుకు పడడం లేదు. 

వరి సాగు.. 15 లక్షల ఎకరాలకు కోత
సీజన్‌లో 23 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికి 2 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా, నీటి విడుదలపై ప్రభుత్వ వైఖరిలో స్పష్టత లేక కేవలం 85 వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. ఈసారి 7.82 లక్షల ఎకరాలకే వరి పరిమితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో  వరి వద్దని చెబుతోంది. ఆ మేరకు ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచి­స్తో­ంది. 

ఖరీఫ్‌లో వరి వేయవద్దన్న ప్రభుత్వం ఇప్పుడు రబీలోనూ అదే రీతిలో ప్రచారం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మరే ఇతర పంటలు వేసినా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయమంటున్న పంటలకు అవసరమైన సబ్సిడీ విత్తనాల సరఫరాపై ప్రభుత్వం మాట్లాడడం లేదు. కనీసం ఆ పంటలకైనా గిట్టుబాటు­ధర కల్పిస్తామన్న భరోసానూ ఇవ్వడం లేదు.

మార్చి వరకు వర్షాభావమే..
అక్టోబర్‌–మార్చి కాలంలో సాధారణ వర్షపాతం 314.4 మిల్లీవీుటర్లు కాగా 302.7 మిల్లీవీుటర్లు మేర వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు వర్షాభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. డిసెంబర్‌లో 30.5%, జనవరిలో 29%, ఫిబ్రవరిలో 21.5%, మార్చిలో 32.3% మేర లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండనుంది. సీమ జిల్లాల్లో రానున్న నాలుగు నెలల్లో సగటున 30% లోటు తగ్గదంటున్నారు. ఓ వైపు వర్షాభావం కొనసాగుతుండగా, సాగునీటి విడుదలపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో రబీలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement