టీచర్లను క్లర్కులుగా మార్చేశారు! | Teachers demand exemption from non teaching tasks | Sakshi
Sakshi News home page

టీచర్లను క్లర్కులుగా మార్చేశారు!

Nov 27 2026 5:42 AM | Updated on Nov 27 2026 5:42 AM

Teachers demand exemption from non teaching tasks

బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు సతమతం

ఎన్నికల శిక్షణ, విధులు, నవోదయ, ఎస్‌ఎల్‌వో డ్యూటీలు.. మరోపక్క నామినల్‌ రోల్స్‌ తయారీ 

ఆడిట్‌ పనులు, రోజువారీ రిపోర్టులు,క్లస్టర్‌ మీటింగ్‌లతో తీరికలేని షెడ్యూల్‌ 

పూర్తిగా నిలిచిపోయిన తరగతి గది బోధన  

మార్చి–2027 పదో తరగతి పరీక్షలపై ఆందోళన.. ఇప్పటికీ పూర్తికాని సిలబస్‌ 

100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలుపై సందిగ్ధం...  

సిలబస్‌ పూర్తికాకుండానే లక్ష్యాల సాధన ఎలా? 

యాప్‌లు, రిపోర్టుల నుంచి విముక్తి కల్పించాలి..  

బోధనేతర పనుల నుంచి మినహాయించాలని ఉపాధ్యాయుల డిమాండ్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అటకెక్కింది. ఉపాధ్యాయులు పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యాబోధనకు పూర్తిగా దూరమయ్యేలా ఉన్నతాధికారులు అప్పగిస్తున్న రకరకాల పనులు, డ్యూటీలతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి–2027 పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులు సిలబస్‌ కూడా పూర్తి చేయలేదని మరింత ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్పగించిన డ్యూటీలే చేస్తున్నా సిలబస్‌ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీసి మెమోలు ఇస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ వచ్చేనెల నుంచి పదో తరగతికి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ఎలా అమలు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. తరగతి గదుల్లో బోధన అందించే తమను అధికారులు ఆఫీసు క్లర్కులుగా మార్చేశారని వాపోతున్నారు.   

ఒకే వారంలో పదుల సంఖ్యలో బాధ్యతలు 
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిస్థితి ’కత్తిమీద సాము’లా తయారైంది. ఒకవైపు రెగ్యులర్‌ తరగతులు బోధిస్తూనే, మరోవైపు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పేపర్ల మూల్యాంకనం, క్లస్టర్‌ మీటింగ్‌లు ‘నో బ్యాగ్‌ డే’ కార్యక్రమాలు, ‘యువ సాథి’ వంటి అదనపు కార్యక్రమాలను (ఇవన్నీ ఒక వారంలో చేయాల్సిన కార్యక్రమాలు.. ఇవి ప్రతి వారం మారుతుంటాయి) సమన్వయం చేయాల్సి వస్తోంది. 

వీటికి తోడు పదో తరగతి నామినల్‌ రోల్స్‌ తయారీ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల నిర్వహణ పనులు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఇటీవల సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు కూడా బయటి మండలాలకు డ్యూటీలు వేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చాలామందిని 50 కి.మీ. దూరం కూడా పంపడం, అదీ ఎలాంటి ముందస్తు ఆదేశాలు, సూత్రప్రాయంగా సమాచారం కూడా లేకుండా స్కూల్‌ లెవెల్‌ అబ్జర్వర్‌ (ఎస్‌ఎల్‌వో) విధానం అమలు చేయడం తీవ్ర విమర్శల పాలైంది.  

బయటి డ్యూటీలు, ఆడిట్‌ ఫైళ్లతో తలబొప్పి 
పాఠశాల స్థాయి పనులే కాకుండా ఉపాధ్యాయులకు ఇతర శాఖల డ్యూటీలు కూడా పెద్ద భారంగా మారాయి. ఎన్నికల శిక్షణ డ్యూటీలు, నవోదయ డ్యూటీలు, ఎస్‌ఎల్‌వో పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలలకు దూరం చేస్తున్నారు. మరోవైపు స్కూల్‌ ఆడిట్‌ పనులు, కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన ఫారాలు నింపడం, ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన రోజువారీ రిపోర్టులతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. బోధనేతర పనులు, బయటి డ్యూటీలకు కేటాయించడంతో తరగతి గదిలో పాఠాలు చెప్పేవారే కరువయ్యారు. 

ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పదో తరగతి సిలబస్‌ ఇప్పటికీ పూర్తి కాలేదు. సబ్జెక్టుల వారీగా పాఠాలు వెనుకబడిపోవడంతో పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం పదో తరగతి మాత్రమే కాకుండా 6, 7, 8, 9 తరగతుల సిలబస్‌ పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా మారింది. రివిజన్, ప్రత్యేక తరగతుల మాట అటుంచితే కనీసం ప్రాథమిక సిలబస్‌ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ‘మిషన్‌ మార్చ్‌–2027’ పేరుతో డ్యూటీ సమయం అనంతరం ఉపాధ్యాయులు బడుల్లోనే ఉండి బోధన చేయాలనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆందోళనలో ఉపాధ్యాయులు
గత విద్యా సంవత్సరం కూడా పాఠశాలలు ప్రారంభమవగానే గిన్నిస్‌ రికార్డు యోగాంధ్ర బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించి నెలరోజులపాటు బోధనకు లేకుండా చేశారు. అనంతరం మెగా పీటీఎం పేరుతో హడావుడి, పీటీఎం పూర్తయ్యాక ఆ కార్యక్రమ నిర్వహణ ఫొటోలు, వీడియోలు యాప్‌లో అప్‌లోడ్‌ పనులు, తవ్వాత అసెస్‌మెంట్‌ బుక్స్‌పై శిక్షణ, హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులపై అవగాహన పేరుతో కాలం గడిపారు. అలాగే, వారంవారం స్వచ్ఛాంధ్ర విధులు, మధ్యలో ఉపాధ్యాయులకు శిక్షణ వంటి విధులు అప్పగించి కాలంగడిపారు. ఇప్పుడూ ఇదే విధానం అమలు చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. 

ఈ విధానాలు దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య మిథ్యగా మార్చేశారని, విషయ బోధన అందించే అవకాశం లేకుండా చేసి కేవలం మార్కులు, పాస్‌ పర్సంటేజికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనవసరపు రిపోర్టులు, యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనేతర డ్యూటీల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తరగతి గదిలో ప్రశాంతంగా పాఠాలు చెప్పుకునే వాతావరణం కల్పిస్తేనే ఈ విద్యా సంవత్సరం సజావుగా గడుస్తుందని స్పష్టం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement