రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండబోదన్న నానుడి నిజం చేస్తూ పంజాబ్‌లో అకాలీదళ్–బీజేపీ మరోసారి ఏకమయ్యాయి. 117 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం చిగురించిన ఈ పొత్తు రెండు పార్టీలకూ తప్పనిసరి అవసరమని గత ఆరేళ్ళుగా నిరూపణ అవుతూనే ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో కూటమి ఓటమి చవిచూసింది. మరో రెండేళ్లకొచ్చిన లోక్‌సభ ఎన్నిక ల్లోనూ ఇదే పునరావృతమైంది. ఎక్కడ తేడాకొట్టిందో అర్థంకాక విచారిస్తున్న అకాలీదళ్‌కు 2020లో సాగు చట్టాలు సాకుగా పనికొచ్చాయి. తొలుత కేంద్ర కేబినెట్ నుంచీ, అటుపై ఎన్డీయే కూటమినుంచీ ఆ పార్టీ నిష్క్రమించింది. తదనంతరం విడివిడిగా పోటీచేస్తూరెండు పార్టీలూ దెబ్బతిన్నాయి.
అంతంతమాత్రం సంస్థాగత అమరికతో నెట్టుకొస్తూ, చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేకున్నా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏకంగా 92 స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో అకాలీలకు 3 స్థానాలూ, బీజేపీకి 2 మాత్రమే దక్కాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగంగా పోటీచేసి 9.63 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీకి 2024 నాటికి ఒంటరిగా పోటీ చేసినా ఈ శాతం రెట్టింపయింది. ఆ ఎన్నికల్లో 18.56 శాతం ఓట్లు వచ్చాయి. అందుకే ఈసారి సీఎం పీఠం కోసం డిమాండ్ చేయాలని స్థానిక నేతలు పట్టుబట్టారు. కానీ గత పొత్తులో ఎప్పుడూ సింహభాగం స్థానాలు పొందుతూ వచ్చిన అకాలీదళ్ ససేమిరా అన్నట్టుంది. అందువల్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత ఒరవడికే అంగీకరించాల్సివచ్చింది. అయితే రివాజుగా ఎప్పుడూ తీసుకునే 23 స్థానాలు కాకుండా కనీసం రెట్టింపు స్థానాలైనా బీజేపీ కోరే అవకాశం ఉంది. ఇది కూటమికి సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు.
అకాలీ–బీజేపీ పొత్తు ఉభయతారకం. పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రైతుల్లో అకాలీలకు పట్టుంటే... పట్టణ ప్రాంతాల్లో బీజేపీ హవా ఉండేది. సంస్థాగతంగా దాని బలం కూడా ఎక్కువే. ఆ రకంగా ఎన్డీయే కూటమి గెలుపు గుర్రంగా కొనసాగేది. అయితే ఆప్ ఆగమనం నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెప్పడం అసాధ్యం. విడిపోయాక బీజేపీ, అకాలీదళ్‌లు బలం పుంజుకోవటానికి ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఈ విషయంలో బీజేపీ కొంతమేర విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం రెట్టింపు కావటమే ఇందుకు రుజువు. కానీ అకాలీలకు అంతర్గత కుమ్ములాటలతోపాటు ఆప్ ఆవిర్భావం తర్వాత సమస్యలు తప్పడం లేదు.
ఒకప్పుడు ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన వర్గాలు చాలా వరకూ దూరమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీలకు మద్దతిచ్చిన వారిస్ పంజాబ్ దే పార్టీ సొంతంగా పోటీ చేయటానికి సిద్ధపడుతోంది. అకాలీల ప్రధాన బలం రాష్ట్ర జనాభాలో 57.7 శాతంగల సిక్కులు. గ్రామీణ ప్రాంతాల్లో జాట్ సిక్కులు మొదటినుంచీ అకాలీలవైపే మొగ్గు చూపే వారు. వారిస్ పంజాబ్ దే ఇందులో వాటాకొస్తోంది. సిక్కు పంథ్ గురించి పాటుపడ తామని హామీ ఇస్తోంది. పర్యవసానంగా అకాలీ ఏదోమేర బలహీనపడే అవకాశం ఏర్ప డింది. వారిస్ పంజాబ్ దే ఇప్పటికే 48 స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది.
అకాలీ, బీజేపీలను జనం పరిగణనలోకి తీసుకోవటం లేదని, వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు ఆప్, కాంగ్రెస్‌లేనని చాలామంది భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు సాకారమైంది. మొన్న ఆగస్టులో అకాలీ నాయకుడు సుఖ్‌బీర్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాంతో తిరిగి రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడుతుందన్న ఊహాగానాలు బయల్దేరాయి. అయితే ఇలా కలసినంతమాత్రాన గత వైభవం గ్యారెంటీ అని చెప్పడానికి లేదు. తిరిగి కలిస్తే ఎన్నికల్లో లబ్ధిపొందగలమన్న లెక్క మినహా ఆరెండు పార్టీలూ ఎందుకు చేతులు కలిపాయన్న ప్రశ్నకు ఇద్దరి దగ్గరా సంతృప్తికరమైన జవాబు లేదు. దానికితోడు ఒకప్పుడు ఉనికిలో లేని ఆప్ బలమైన శక్తిగా ఆవిర్భవించింది.
గత అయిదేళ్ల పాలనలో అది తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, ఉచిత విద్యుత్ వగైరాలు జనాన్ని ఆకర్షించాయి. ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో అవినీతికి తావులేకుండా చూడటం ఆప్‌కు తోడ్పడే అంశం. మాదకద్రవ్యాలను అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. ఏదేమైనా ఈసారి పంజాబ్ ముక్కోణపు పోటీని చూడాల్సివస్తుంది.


