ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఏమార్చిన వైనం సాధికారికంగా, సందేహాతీతంగా బయటపడింది. జాతీయ స్థాయి మీడియా సంస్థలు ఉమ్మడిగా ఏర్పాటుచేసిన పాత్రికేయ బృందం ‘ద రిపోర్టర్స్ కలెక్టివ్’ ఇప్పటికే మహారాష్ట్రలో జరిగిన కొన్ని నిర్వాకాల్ని ప్రపంచానికి చూపింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోని చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి ఓటింగ్ సరళిపై బృందం చేసిన పరిశోధన బాబు ముఠా అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి ఎన్ని పోకడలకు పోయిందో తెలియజేసింది. బాబు సొంత నియోజక వర్గం కుప్పంలో సైతం గోల్‌మాల్ జరిగిందని ఈ డేటాను నిశితంగా గమనిస్తే అర్థమవు తుంది.
2024 మే 13 పోలింగ్‌లో సాయంత్రం 6 తర్వాత నుంచి రాత్రి 2 గంటల వరకూ ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వివిధచోట్ల 56,067 మంది ఓటర్లున్నారని ఈసీ అంతర్గత రికార్డులు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలప్పుడు ఓటర్లు పార్లమెంటుకు ఒక ఓటు, అసెంబ్లీకి మరో ఓటు వేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కేవలం 24,596 మంది మాత్రమే ఓట్లు వేశారని ఈసీ రికార్డులంటున్నాయి. మిగిలిన 31,471 మంది వేసిన ఓట్లు ఏ గంగలో కలిపారన్నది అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. రానున్న రోజుల్లో ఇతర నియోజకవర్గాల బండారం కూడా బయటపడుతుంది. కనుక మరిన్ని షాక్‌లకు ప్రజానీకం సిద్ధంగా ఉండకతప్పదు.
అప్పట్లో వెలువడిన ఫలితాలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందనేమిటో అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజలకు ఇన్ని మేళ్లు చేశాక కూడా ఫలితా లిలా వచ్చాయంటే ఎక్కడో మోసం జరిగే వుంటుందని ఆయన సందేహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో తన వద్ద రుజువుల్లేవని కూడా చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఎన్నికను సవాల్ చేస్తే పరిశీలించటానికి 45 రోజులవరకూ వీవీ ప్యాట్ స్లిప్‌లూ, ఈవీఎంల డేటా, సీసీ కెమెరాల ఫుటేజ్ వగైరాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నాయి.
కానీ అందుకు భిన్నంగా వీటన్నిటినీ ఈసీ కొద్దిరోజులకేధ్వంసం చేసి ‘గుమ్మడికాయల దొంగ’ మాదిరి భుజాలు తడుముకుంది. అప్పుడే ‘ఏదో జరిగింద’ని అందరూ అనుమానించారు. చిత్రమేమంటే క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ అధికారి సంతకంచేసి ఇచ్చే టోకెన్లు కూడా గల్లంతయ్యాయి. 3,500 పోలింగ్‌కేంద్రాల్లో తెల్లారుజామువరకూ ఓటేసేంతమంది సాయంత్రం 6 తర్వాత ఉన్నారని ఈసీ చేసిన ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తింది. ఈ మాయదారి ఓటింగ్ అసాధారణంగా ఉండటంపైనా, నరమానవులకు సాధ్యం కాని రీతిలో ఆరేసి సెకన్లకొకరు ఓటేసిన వైనంపైనా ప్రముఖ విశ్లేషకుడు, సామాజికవేత్త పరకాల ప్రభాకర్ నిలదీశారు. ఇప్పుడు పాత్రికేయ బృందం జరిపిన పరిశోధన వాటికి కొనసాగింపు.
జనం ఆమోదంతో అధికారం పొందినవారికీ, దొంగచాటు కుట్రలతో దాన్నిచేజిక్కించుకున్నవారికీ మధ్య పాలనలో, పద్ధతిలో ఎంత తేడా ఉంటుందో చెప్పడానికి రెండున్నరేళ్లకుపైగా బాబు ఆధ్వర్యంలోని కూటమి ఏలుబడే నిదర్శనం. తాను చట్టవిరుద్ధంగా పీఠాన్నధిష్టించిన బాబు... ఊరూరా తన బాపతుగాళ్లను ప్రతిష్ఠించ టానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు మొదలుకొని అభ్యర్థుల గెలుపు ప్రకటన వరకూ టీడీపీ గూండాల్ని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని బరితెగించిన తీరును చానెళ్లసాక్షిగా అందరూ చూశారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కొల్లగొట్టినప్పటి నుంచీ రాజకీయాల్లో బాబు బాణీ మారలేదని పాత్రికేయ బృందం వెల్లడించిన వివరాలు రుజువుచేస్తున్నాయి. చిత్రమేమంటే వెల్లడైన ఈ అక్రమాల్ని తప్పుడు ప్రచారంగా ఏపీ ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కొట్టిపారేస్తున్నారు. ఈ అవకతవకలపై రెండున్నరేళ్లుగా శవాసనం వేసుకున్నట్టు మిన్నకున్న ఈసీ ఇప్పుడే కోమానుంచి బయటపడినట్టుంది. ఎవరిది అక్రమమో, ఎవరిది తప్పుడు ప్రచారమో బట్టబయలైంది. ఈలోగా బెదిరించి నోళ్లు మూయించలేమని యాదవ్ గ్రహిస్తే మంచిది. అసలు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి పీఠాలెక్కినవారిని నేతలనాలో... దుశ్శాసన భ్రాతలనాలో జనమే తేల్చుకోవాలి.


