లక్నో: 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కావచ్చని, లేదంటే మరొకరికి అవకాశం రావచ్చని ఆయన చెప్పారు.
ఒక ప్రముఖ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మౌర్య.. బీజేపీ ఎన్నికల్లో కమలం గుర్తుతో పాటు ప్రధాని మోదీ నాయకత్వం, ప్రభుత్వ పనితీరును ఆధారంగా చేసుకుని పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించి సీఎంను ఎన్నుకుంటారని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ 2023లో ఇదే విధానాన్ని అనుసరించామని మౌర్య గుర్తుచేశారు. అయితే యోగి ఆదిత్యనాథ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మౌర్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కోర్టు వెలుపల హత్యాయత్నం.. కత్తులతో దాడి, కాల్పులు


