రసాభాసగా పోలీస్‌ బాస్‌ల నైట్‌ పార్టీ : ఒకరికి గాయాలు | Assam IPS Officers Late Night Party Ends In Physical Fight Cop Injured | Sakshi
Sakshi News home page

రసాభాసగా పోలీస్‌ బాస్‌ల నైట్‌ పార్టీ : ఒకరికి గాయాలు

Nov 25 2026 1:13 PM | Updated on Nov 25 2026 1:15 PM

Assam IPS Officers Late Night Party Ends In Physical Fight Cop Injured

గువాహటి: అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో సీనియర్ పోలీసు అధికారుల విందు హింసాత్మకంగా మారి పోయింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల మధ్య వాగ్వాదం ముదిరి భౌతిక దాడికి దారితీసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కోక్రాఝర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అక్షత్ గార్గ్ , డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) వైటీ గెట్సు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అస్సాం పోలీస్ ప్రధాన కార్యాలయం ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ, ఇది ఒక వ్యక్తిగత విషయమని పేర్కొనడం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  సరైఖోలాలోని 7వ అస్సాం పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో ఈ విందు జరిగినట్లు సమాచారం. ఈ పార్టీని ఎస్‌ఎస్‌పీ  గార్గ్ ఏర్పాటు చేశారు. ఈ  పార్టీలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రమై భౌతిక ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో  ఎస్‌ఎస్‌పీ గార్గ్‌కు పలు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ   స్పందిస్తూ ఇది వ్యక్తిగత వ్యవహారమని కొట్టి పారేశారు. ఇది ప్రైవేట్‌ పార్టీ అని,  ఆ సమయంలో అధికారులు విధుల్లో లేరు  కనుగ తామేమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఘర్షణ జరిగి ఉంటే ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకునేదని చెప్పారు.

 మరోవైపు ఇద్దరు అధికారుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి జోక్యం చేసుకోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర కుమార్‌ను అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అలాగే గార్గ్‌కు ఎ లాంటి గాయాలయ్యాయి. ఈ విషయంలో అధికారిక శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు.

పోలీసు సిబ్బంది తమ మాటలు, ప్రవర్తన , చర్యల ద్వారా యూనిఫాం గౌరవాన్ని, బాధ్యతను నిలబెట్టేలా వ్యవహరించాలని పాసింగ్-అవుట్ పరేడ్‌లో కొత్తగా ఎంపికైన అస్సాం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి శర్మ ప్రసంగించిన రోజే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  దేర్గావ్‌లోని లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీలో జరిగిన కొత్త రిక్రూట్‌లను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కిచెప్పారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసభ్యకరమైన లేదా అనుచితమైన భాషను ఉపయోగించవద్దని వారిని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement