న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు వెళ్లాల్సిన తనను ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మతో కూడిన ధర్మాసనం తెలిపింది.
సౌరవ్ దాస్ నవంబర్ 23న బ్రిటన్ వెళ్లాల్సి ఉంది. డిసెంబర్ 1న ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నిర్వహించే కార్యక్రమంలో ‘కాక్రోచ్ మూవ్‌మెంట్’ గురించి మాట్లాడేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. అయితే పాస్‌పోర్టులో జన్మస్థలం తప్పుగా నమోదైందనే కారణంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ప్రయాణాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. పాస్‌పోర్టులో జన్మస్థలంగా చెన్నై పేర్కొన్నారని, ఈ విషయంపై చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం చర్యలు ప్రారంభించిందని పలు నివేదికలు వెల్లడించాయి.
నవంబర్ 23నే సౌరవ్‌కు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం సమర్పించే వరకు పాస్‌పోర్టును ప్రయాణానికి ఉపయోగించవద్దని సూచించినట్లు సమాచారం. కాగా, ఆయన పాస్‌పోర్టును 2019 ఆగస్టు 21న చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసింది.
ఈ పరిణామంపై సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో వంటి విద్యాసంస్థల్లో ప్రసంగించేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విద్యావంతులైన యువత ఇతర విద్యావంతులతో మేధోపరమైన చర్చలు జరపడం పట్ల ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనతో తన ప్రయత్నాలు ఆగవని, భవిష్యత్తులో లండన్, పారిస్ తదితర ప్రాంతాలకు వెళ్తానని పేర్కొన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆక్స్‌ఫర్డ్‌లో ప్రసంగించేందుకు సౌరవ్‌కు ఆహ్వానం రావడంపై అధికారంలో ఉన్నవారిలో ఎవరో అసూయపడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: గురునానక్ జయంతి వేళ.. పెట్రోల్, డీజిల్ ఫ్రీ!


