పదవీ విరమణ వివాదంలో ఈఎస్‌ఐసీ రికార్డులకే ప్రాధాన్యం
యాజమాన్యం స్వయంగా నమోదు చేసిన తేదీని కాదనడం చెల్లదు
జేజే ఎలక్ట్రానిక్స్ పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
6 శాతం వడ్డీతో ఏడాది బకాయి వేతనాలు చెల్లించాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డు ఒక్కటే తుది ఆధారం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) రికార్డుల్లో యాజమాన్యమే నమోదు చేసిన పుట్టిన తేదీని కాదని, ఆధార్ కార్డు ఆధారంగా ఉద్యోగిని ఏడాది ముందే తొలగించడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని సెక్షన్ 25ఎఫ్‌ను పాటించకుండా కార్మికురాలిని తొలగించడం అక్రమమని లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జేజే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ ధర్మాసనం నవంబర్ 13న కొట్టివేసింది.
అసలు వివాదం ఇదీ..
రోసమ్మా జాయ్ 1981 డిసెంబర్ 1 నుంచి జేజే ఎలక్ట్రానిక్స్‌లో ‘ఫినిషింగ్ మ్యాన్’గా పనిచేశారు. చివరిగా నెలకు రూ.10,500 వేతనం అందుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం 2017 మార్చి 3న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సవరించిన కనీస వేతనం, 2017 ఏప్రిల్ నెల బకాయి జీతం అడిగినందుకు యాజమాన్యం 2017 మే 20న ఆమెను విధుల నుంచి తొలగించింది. సెక్షన్ 25ఎఫ్, 25జీ ఉల్లంఘనపై ఆమె సెక్షన్ 2ఏ(2) కింద లేబర్ కోర్టును ఆశ్రయించారు.
లేబర్ కోర్టు తీర్పు
ఆధార్ ప్రకారం ఆమె పుట్టిన తేదీ 1959 మే 20 అని, 2017 మే 20 నాటికి పదవీ విరమణ వయసు(58 ఏళ్లు) పూర్తయిందని యాజమాన్యం వాదించింది. కంటి శుక్లాల శస్త్రచికిత్స తర్వాత స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, సంస్థలో 10 మంది కంటే తక్కువ కార్మికులు ఉన్నారని పేర్కొంది. న్యూఢిల్లీలోని లేబర్ కోర్టు9 (ఎల్‌ఐడీ 78/2018) ఈ వాదనలను తోసిపుచ్చింది. 2010 జూన్ 26న ఈఎస్‌ఐసీ రికార్డుల్లో యాజమాన్యమే ఆమె పుట్టిన తేదీని 1960 మే 20గా నమోదు చేసినట్లు గుర్తించింది. 2017 మే 20 నుంచి 2018 మే 20 వరకు నెలకు రూ.14,698 చొప్పున పూర్తి బకాయి వేతనాలు, ఇతర ప్రయోజనాలను 6 శాతం వడ్డీతో చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.
హైకోర్టు స్పష్టీకరణ
ఈ తీర్పుపై కంపెనీ యాజమాన్యం ఆర్టికల్ 226 కింద ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 226, 227 కింద లేబర్ కోర్టు తీర్పుల్లో జోక్యం పరిమితమని హైకోర్టు పేర్కొంది. యూఐడీఏఐ 2018 డిసెంబర్ 20న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం, 2024లో ‘సరోజ్ వర్సెస్ ఇఫ్కో–టోకియో జనరల్ ఇన్సూరెన్స్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆధార్ కార్డు పుట్టిన తేదీకి తుది రుజువు కాదని స్పష్టం చేసింది. తొలగింపునకు రెండు నెలల ముందు (2017 మార్చిలో) అందిన ఆధార్‌ను చూపి ఏడాది ముందే ఉద్వాసన పలకడం చెల్లదని తేల్చిచెప్పింది. రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా రోసమ్మా జాయ్‌కు విడుదల చేయాలని, మిగిలిన బకాయిని నాలుగు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.


