అధికారులు బీజేపీ నేతల్లా పనిచేస్తున్నారు | UP Govt Officials Acting as BJP Functionaries says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

అధికారులు బీజేపీ నేతల్లా పనిచేస్తున్నారు

Nov 22 2026 5:52 AM | Updated on Nov 22 2026 5:52 AM

UP Govt Officials Acting as BJP Functionaries says Akhilesh Yadav

వారి వివరాలను ఈసీకి అందజేస్తాం

యూపీ ఎన్నికల వేళ ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ వ్యాఖ్యలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా ప్రభుత్వంలోని కొందరు అధికారులు బీజేపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. గత పదేళ్లుగా బీజేపీ అడుగులకు మడుగులొత్తే అటువంటి అధికారుల పేర్ల జాబితాతో కూడి న లేఖను ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి పంపిస్తామని తెలిపారు. ఆ లేఖపై తమపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలుంటాయన్నారు. 

శనివారం లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడారు. అధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ప్రభుత్వం వారిని బదిలీ చేయ కుండా, కొనసాగిస్తోందని విమర్శించారు. అయితే, అలాంటి అధికారుల పేర్లను ఆయన వెల్లడించలేదు. ‘బీజేపీని గద్దె దించడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు అవసరం. ఇందుకుగాను ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే మార్గం. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం, గౌరవంతోపాటు ఆత్మగౌరవం దక్కడం బీజేపీ పాలనలో పెను సవాల్‌గా మారాయి. బీజేపీని అధికారం నుంచి దూరం చేసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి’అని అఖిలేశ్‌ చెప్పారు. 

రాష్ట్రంలోని ఓటరు జాబితాల నుంచి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు తొలగింపునకు గురయ్యాయంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘తొలగించిన హిందూ ఓటర్ల సంఖ్య మాత్రమే ఆయనకు ఎలా తెలిసింది? యోగి దగ్గర అద్భుత శక్తులున్నాయా?’అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితుల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నదంటూ మండిపడ్డారు. ఓటరు జాబితా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ తమ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. లేదంటే బీజేపీ మరోసారి అక్రమాలకు పాల్పడే అవకాశముందంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తాం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఆ పార్టీ గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను తమ పార్టీ సూచిస్తుందని వివరించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు అవకాశాలున్న సీట్లు చాలానే ఉన్నాయి. వాటిపై తగు విధంగా కాంగ్రెస్‌కు సలహా ఇస్తాం. ఇదే విషయాన్ని మొదట్నుంచీ చెబుతూ వస్తున్నా. ఇప్పుడూ అదే స్పష్టం చేస్తున్నా. పంపకాల్లో సీట్ల గెలిచేందుకు గల అవకాశాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటాం’అని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement