శీతాకాలం అంటేనే చలిచలిగా..నెమ్మదిగా ఉన్నట్లు ఉంటుంది. శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఏం తిన్న అంత తొందరగా అరగదు. ఇక పెద్దవాళ్లు, చిన్నపిల్లలు అయితే చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఈ కాలంలో పెద్దగా ఏం తినలేరు. దాంతో నీరసించి పోతూ త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారనపడతారు. అలా కాకూడదంటే..పుష్టిని, శక్తిని అందించే సత్తు లడ్డూలు తినడం ఎంత మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ తోపాటు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. మరి దీని తయారీ విధానం, తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
ఇది మన సాంప్రదాయ భారతీయ స్వీట్. దీనికి మరిన్ని ఆరోగ్యకరమైన మెరుగులు అద్దుతూ ఇలా తయారు చేసుకుందాం.
ఎలా చేస్తారంటే..
కావలసిన పదార్థాలు: వేయించిన శనగలు (పొట్టు తీసినవి) – 2 కప్పులు, తురిమిన ఎండు కొబ్బరి – ½ కప్పు, మిశ్రమ నట్స్ – ½ కప్పు (బాదం, జీడిపప్పు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు), యాలకుల పొడి – 1 టీస్పూన్, నెయ్యి – 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి – ¾ కప్పు, నీరు – ¼ కప్పు
తయారీ విధానం: ఒక బాణలిలో తక్కువ మంట మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, మిశ్రమ నట్స్ వేసి బాగా వేయించాలి. అదే బాణలిలో వేపుడు సెనగపప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి. దీనికి తురుమిని ఎండు కొబ్బరి జోడించి అన్నింటిని బాగా కలపండి. రంగు మారకుండా తేలికగా వేయించండి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సర్‌జార్‌లో వేసి కాస్తా గరుకుగా గ్రైండ్ చేయండి. వేరొక బాణలిలో బెల్లంపొడి, నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి.
తక్కువ నుంచి మధ్యస్థ మంట మీద ఏడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. బెల్లం కరిగి, పాకం కొద్దిగా చిక్కగా జిగురుగా మారే వరకు ఉడికించండి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని గోరు వెచ్చని పాకంలో వేసి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత యాలకులు పొడి, జాజికాయ పొడి కలపాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న భాగాలుగా తీసుకుని గుండ్రని లడ్డూలుగా చేయాలి. వీటిని శుభ్రమైన గాలి చొరబడి డబ్బాలో నిల్వ చేయండి. గది ఉష్ణోగ్రత వద్ద సుమారు ఏడు నుంచి ఎనిమిది రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో మాత్రం సుమారు 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
ప్రయోజనాలు..
వేపుడు శెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నట్స్, గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి. బెల్లం సహజ తీపిని, తక్షణ శక్తిని ఇస్తుంది.
ఇది కండరాల బలానికి, అలాగే చలికాలంలో నీరసం బారిన పడకుండా రక్షిస్తుంది.
చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఇందులోని పోషకాలు సహాయపడతాయి.
ఇందులోని ఫైబర్ మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం, వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
సత్తు పిండికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కడుపు నిండిన భావన కలగడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్.
ఇదీ చదవండి: ‘దారి’తో తలరాతనే మార్చుకున్నారు..!


