నాగా సంప్రదాయ సంస్థలపై గౌహతి హైకోర్టు ఆగ్రహం | Article 371A Gauhati HC Quashes Excommunication of 38 Village | Sakshi
Sakshi News home page

నాగా సంప్రదాయ సంస్థలపై గౌహతి హైకోర్టు ఆగ్రహం

Nov 14 2026 1:24 PM | Updated on Nov 14 2026 1:24 PM

Article 371A Gauhati HC Quashes Excommunication of 38 Village

ఆచారాల పేరుతో హక్కుల హననం చెల్లదు 

సామాజిక బహిష్కరణలు రాజ్యాంగ విరుద్ధం 

సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తే ఊరుకోం

సాక్షి, న్యూఢిల్లీ: ఆచారాలు, సంప్రదాయాల పేరుతో వ్యక్తులను, కుటుంబాలను సామాజికంగా బహిష్కరించే అధికారం ఏ సంప్రదాయ గ్రామ వ్యవస్థలకూ లేదని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371ఏ కింద నాగా ఆచార వ్యవహారాలకు ప్రత్యేక రక్షణ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు రక్షణ కవచంగా మారజాలదని తేల్చిచెప్పింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా న్యాయ సమీక్ష ద్వారా అడ్డుకుంటామంటూ జస్టిస్‌ యరెన్‌జుంగ్లా లొంగ్‌కుమెర్‌ ఈనెల 10వ తేదీన సంచలన తీర్పు వెలువరించారు. 

కేసు పూర్వాపరాలివీ.. 
మొకొక్‌చుంగ్‌ జిల్లా చంగ్‌టోంగ్యా ఏరియాలోని యవొంగ్‌యిమ్సెన్‌ గ్రామానికి చెందిన కొందరు గతంలో చుమౌకెడిమా యావోంగ్‌యిమ్సెన్‌ అనే యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ యూనియన్‌ ప్రారంభమైన సంవత్సరం విషయంలో వివాదం ఏర్పడింది. 1989లోనే స్థాపించినట్లు ఒకవర్గం వాదించగా, 2001లో ఏర్పడినట్లు మాత్రమే తాము గుర్తిస్తామంటూ మరో వర్గం పట్టుబట్టింది. ఈ పంచాయతీ యావొంగ్‌ యిమ్సెన్‌ పుటు మెండెన్, యావొంగయిమ్సెన్‌ సెన్సో ముంగ్‌డంగ్‌ అనే నాగా ఆచార సంస్థలకు చేరింది. విచారణ చేపట్టిన సెన్సో ముంగ్‌డంగ్‌ సంస్థ యవొంగ్‌యిమ్సెన్‌కి చెందిన 42 మందిని గ్రామ బహిష్కరణ చేస్తూ 2024 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చింది. డిసెంబర్‌ 10న ఆ కుటుంబీకులపై మరిన్ని ఆంక్షలు విధించింది. చిన్నారులు, మహిళలు సహా 42 మందిని గ్రామంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. గ్రామస్తులతో వివాహ సంబంధాలు పెట్టుకోరాదని, చర్చిలు, ఇతర సామాజిక సంస్థల్లో తమను తాము యవొంగ్‌యిమ్సెన్‌ గ్రామస్తులుగా చెప్పుకోరాదన్నారు. వారి సర్టిఫికెట్లలో గ్రామం పేరును తొలగించాలని ఆదేశించారు. దీంతో, బాధితులు తమ ప్రాథమిక హక్కులకు తీవ్రంగా భంగం కలిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు.    

ఇదీ  చదవండి: తల్లిపై కత్తితో కొడుకు దాడి : తర్వాత భవనంపైనుంచి పడి..!

రాజ్యాంగ హక్కులకే పెద్దపీట.. 
సామాజిక బహిష్కరణల వంటి కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు నాగా ఆచార సంస్థలు (విలేజ్‌ కౌన్సిళ్లు) ఆర్టికల్‌ 371ఏను ఆసరాగా చేసుకుంటున్న తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులైన ఆర్టికల్‌ 14 (చట్టం ముందు సమానత్వం), ఆర్టికల్‌ 15 (జాతి, కుల, మత, లింగ వివక్ష నుంచి రక్షణ), ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు) లను ఏ ఆచార చట్టం కాలరాయలేదని స్పష్టం చేసింది. గ్రామీణ సంస్థలు స్థానిక ఆచారాల పేరుతో పౌరులను ఊరినుంచి వెలివేయడం, సామాజికంగా బహిష్కరించడం అమానుషమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పౌరులు గౌరవప్రదంగా జీవించే హక్కును హరించడాన్ని చట్ట వ్యతిరేక చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టింది. 

ఆర్టికల్‌  371ఏ ఏం చెబుతోంది?.. 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371ఏ ప్రకారం నాగాలాండ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. దీని ప్రకారం ప్రధానంగా నాలుగు అంశాల్లో పార్లమెంట్‌ చేసే చట్టాలు నేరుగా ఈ రాష్ట్రంలో అమలు కావు. నాగా మతపరమైన లేదా సామాజిక ఆచారాలు, నాగాల నియమాలు, ఆచార చట్టాల ప్రకారం పౌర-క్రిమినల్‌ న్యాయ నిర్వహణ, భూమి-వనరుల యాజమాన్యం బదిలీ వంటి అంశాల్లో నాగాలాండ్‌ శాసనసభ తీర్మానం చేస్తేనే కేంద్ర చట్టాలు వర్తిస్తాయి. అయితే, ఈ ప్రత్యేక రక్షణను సాకుగా చూపుతూ పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసే అధికారం ఏ గ్రామ కౌన్సిల్‌కూ లేదని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. 

న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు లేదు 
సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏదేని ఆచార సంస్థ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ సమీక్ష తప్పదని హెచ్చరించింది. అనాదిగా వస్తున్న ఆచారాలు ఆధునిక చట్టాలకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని తీర్పులో వెల్లడించింది. విలేజ్‌ కౌన్సిళ్లు తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని హితవు పలికింది. 

గత తీర్పుల స్ఫూర్తితో 
గతంలో మహిళల హక్కులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు సైతం ఇదే తరహాలో తీర్పు వెలువరించింది. ‘నాగా మదర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ నాగాలాండ్‌’కేసులో సాంస్కతిక పరిరక్షణను సాకుగా చూపి మహిళలకు రాజకీయ హక్కులను నిరాకరించకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతకుముందు 2023లో ఓ అత్యాచారం కేసులో నిందితుడిని పదేళ్లపాటు గ్రామ బహిష్కరణ చేస్తూ ఓ విలేజ్‌ కౌన్సిల్‌ ఇచ్చిన తీర్పును సైతం గౌహతి హైకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పు నేపథ్యంలో నాగా ఆచార చట్టాలను రాజ్యాంగ పరిధికి లోబడి క్రోడీకరించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement