కోయంబత్తూరు: కూరగాయల మార్కెట్‌లో ఉల్లి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. చిన్న ఉల్లిపాయల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తమిళనాడులోని కోయంబత్తూరు మార్కెట్‌లో కిలో చిన్న ఉల్లిపాయల హోల్‌సేల్ ధర రూ.180కి చేరగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.200 పలుకుతోంది. సరఫరా తగ్గిపోవడంతో రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి.
గత నెల రోజులుగా చిన్న ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల హోల్‌సేల్ ధర రూ.180 దాటింది. ఇదే పరిస్థితి కొనసాగితే కిలో ధర రూ.200కు చేరే అవకాశం ఉందని కోయంబత్తూరు టీ.కే. మార్కెట్ వెజిటబుల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజేంద్రన్ తెలిపారు. ప్రస్తుతం కోయంబత్తూరులోని అలందురై ప్రాంతంతో పాటు పల్లడం పరిసరాల్లోని పెద్ద రైతుల వద్ద మాత్రమే చిన్న ఉల్లిపాయల నిల్వలు ఉన్నాయి. అక్కడి నుంచే తమిళనాడు, కేరళ మార్కెట్లకు సరఫరా జరుగుతోంది.
డిసెంబర్ వరకు ఉపశమనం లేనట్టే!
తదుపరి పంట డిసెంబర్ మధ్యలో చేతికి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు చిన్న ఉల్లిపాయల ధరలు తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్ద ఉల్లిపాయల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.60కి విక్రయిస్తున్నారు. దీపావళి తర్వాత మహారాష్ట్రలో కోతలు వేగవంతం కావడంతో వారం రోజుల్లో అక్కడి నుంచి కొత్త సరఫరా మార్కెట్లకు చేరనుంది. దీంతో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.40 వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక వెల్లుల్లి ధరలు సైతం భారీగా పెరిగాయి. నాణ్యమైన వెల్లుల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.300 పలుకుతోంది. ఉల్లి, వెల్లుల్లి ధరల పెరుగుదలతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై భారం పెరుగుతోంది.
ఇదీ చదవండి: ముంబైలో విచిత్రం.. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ!


