ఢిల్లీలో రాయితీపై కిలో రూ.35కే విక్రయాలు షురూ
త్వరలో లక్నో, పట్నా, అమృత్‌సర్, కోల్‌కతా, చండీగఢ్‌లోనూ
బఫర్ నిల్వలకు కొదవ లేదంటున్న ప్రభుత్వం
అక్రమ నిల్వలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. బఫర్ నిల్వ ల్లోని ఉల్లిని మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ఢిల్లీలో కిలో రూ.35కే రాయితీపై విక్రయాలను ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ పథకాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. అక్రమంగా నిల్వ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అకాల వర్షాలు.. పాడైన నిల్వలు..
దేశంలో ఉల్లి దిగుబడి పుష్కలంగా ఉంది. దేశీయ అవసరాలకు మించిన ఉత్పత్తి ఉన్నప్పటికీ ధరల పెరుగుదలకు ప్రధానంగా అకాల వర్షాలు, నిల్వ ఉంచిన ఉల్లి కుళ్లిపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. 2025–26లో దేశంలో 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి జరిగింది. దేశీయంగా ఏడాదికి 204 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ ఉత్పత్తి దేశీయ డిమాండ్‌ను సులభంగా తీర్చగలిగేది. కానీ ఈసారి రబీ పంట కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు ఉల్లి డిమాండ్ లెక్కలను మార్చేశాయి.
మార్చి, ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో తేమశాతం పెరిగి నిల్వ చేసిన ఉల్లిలో ఫంగస్ ఏర్పడి కుళ్లిపోవడం ప్రారంభమైంది. సాధారణంగా ఏటా ఉల్లి ఉత్పత్తిలో 25 శాతం వరకు నష్టం జరుగుతుంది. ఈ ఏడాది వర్షాలు, అధిక తేమ కారణంగా ఈ నష్టం 35–40 శాతానికి పెరిగినట్లు అంచనా. అంటే, 110 నుంచి 120 లక్షల టన్నుల ఉల్లి కుళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్లకు చేరుతున్న నాణ్యమైన ఉల్లి పరిమాణం తగ్గింది. ఇదే ధరల పెరుగుదలకు కారణమైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు చేరింది.
రాజధానిలో సంచార విక్రయ కేంద్రాలు
ధరల కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ఆధ్వర్యంలో మొబైల్ వాహనాలు, రిటైల్ కేంద్రాల ద్వారా రాయితీ ఉల్లిని విక్రయిస్తున్నారు. ఢిల్లీలో 40 ఎన్‌సీసీఎఫ్ మొబైల్ వాహనాలు, 50 నాఫెడ్ మొ బైల్ వాహనాలు, వాటి రిటైల్ కేంద్రాలతో పాటు కేంద్రీయ భండార్ దుకాణాల్లోనూ ఉల్లిని అందుబాటుకి తెచ్చారు. త్వరలో లక్నో, పటా్న, అమృత్‌సర్, కోల్‌కతా, చండీగఢ్ తదితర నగరాలకు రాయితీపై ఉల్లిని విక్రయించనున్నారు.
దేశంలోని ప్రధాన వినియోగ కేంద్రాలకు రైలు, రోడ్డు మార్గాల్లో ఉల్లిని తరలించనున్నారు. ఇదే సమయంలో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ధరల పెరుగుదల కోసం ఉల్లిని దాచిపెట్టే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పండుగల సమయంలో సరఫరాకు ఇబ్బంది లేకుండా బఫర్ నిల్వలను అవసరమైన మేరకు విడుదల చేస్తామని వెల్లడించింది.


