సోనియా ఆత్మకథపై పెంగ్విన్ వెల్లడి
మార్పులకు సోనియా నోఅనడమే కారణమా?
న్యూఢిల్లీ: ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’భారత ప్రచురణకర్తలు తాము కాదని శుక్రవారం ప్రకటించింది. ‘‘చర్చలు జరుగుతున్నంత కాలం ఈ పుస్తక ప్రచురణపై తాము ఆసక్తిగానే ఉన్నామని... అయితే రచయితల ఫ్యాక్ట్ చెక్ చేయడం తమ బాధ్యత, నిర్ణయాధికారం’’అని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.
కొన్ని వారాల క్రితమే పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇంప్రింట్‌గా పుస్తకాలు ప్రచురించే అమెరికన్ పబ్లిషర్ ఆ్రల్ఫెడ్ ఏ క్నాఫ్.. సోనియాగాంధీ ఆత్మకథ ఈ ఏడాది నవంబరు పదవ తేదీన విడుదల అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుస్తకంలో కొన్ని మార్పులు చేసేందుకు సోనియాగాంధీ నిరాకరించడంతో పెంగ్విన్ ప్రచురణ విషయంలో వెనక్కు తగ్గిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది.
‘‘బిలాంగింగ్ పుస్తకం భారత పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కాదు. అయితే పుస్తకంలో కొన్ని మార్పులు చేసేందుకు రచయిత నిరాకరించడం వల్ల పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తే... అది వాస్తవ పరిíస్థితులకు అద్దం పట్టేది కాదు’’అంటూ పెంగ్విన్ తన ప్రకటనలో తెలిపింది. ‘‘వాస్తవాలను సరిచూడటం, రచయిత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి సలహా, సూచనలు చేయడం ప్రచురణకర్తలుగా మా బాధ్యత, నిర్ణయాధికారం.
ప్రచురణ ప్రక్రియలో ఇది సాధారణంగా జరిగేదే. చర్చలు కొనసాగినంత కాలం పెంగ్విన్ పుస్తక ప్రచురణపై ఆసక్తి కనబరిచింది’’అని వివరించింది. ఇంతకు మించి రచయితతో తాము జరిపిన చర్చల వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.... ప్రచురణ కర్త ఎవరో స్పష్టం కాకపోయినా ఈ పుస్తకం రూ.2615లకు ప్రీ ఆర్డర్ చేయవచ్చు అని ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కనిపించడం!! ఇందులో ప్రచురణ కర్తగా యూకేకు చెందిన హార్పర్ కాలిన్స్ ఇన్‌ప్రింట్ ‘‘విలియం కోలిన్’’గా పేర్కొన్నారు.
ప్రభుత్వ ఒత్తిడి వల్లే: కాంగ్రెస్
సోనియా గాంధీ ఆత్మకథను ప్రచురించే విషయంలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెనక్కు తగ్గడం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లేనని పలువురు కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇంప్రింట్ ఆ్రల్ఫెడ్ ఏ క్నాఫ్ ముద్రిస్తూండగా లేనిది భారత్‌లో పెంగ్విన్ ఇండియా ముద్రించకుండా ఎవరు ఆపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ విమర్శించారు. ‘‘ఒత్తిడి తీసుకొచ్చి నిలిపేయడం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛను హత్య చేయడంతో సమానం’’అని వ్యాఖ్యానించారు. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సంబంధించిన సమాచారం, మోదీ హయాంలో చైనా భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన వైనాలను తొలగించాలని పెంగ్విన్ ఇండియాపై ఒత్తిడి వచి్చందని ఆరోపించారు.


