breaking news
Penguin ryandam House
-
పెంగ్విన్ నుంచి పాకెట్ సైజ్ పుస్తకాలు
న్యూఢిల్లీ: ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా యువ పుస్తక ప్రియులు లక్ష్యంగా వినూత్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. జేబులో ఇమిడిపోయేంత చిన్నగా, సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా రూపొందించిన ఈ పుస్తకాల విలువ రూ.125 మాత్రమేనని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రకటించింది.దేశంలోని అన్ని వర్గాలతోపాటు నేటి తరం పాఠకులకు ప్రసిద్ధి చెందిన సాహిత్యాన్ని మరింత సులభంగా, చౌకగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ’పెంగ్విన్ పాకెట్స్’ పేరుతో కొత్తగా బుక్ సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మొదటగా భారతీయ, విదేశీ సాహిత్యం, భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ కాలాలకు చెందిన 16 ప్రముఖ పుస్తకాలను విడుదల చేస్తున్నామన్నారు. ఇవి అక్టోబర్ ఆఖరుకల్లా దేశంలోని పుస్తకాల దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వస్తాయని పెంగ్విన్ తెలిపింది. ‘పెంగ్విన్ పాకెట్స్’ ద్వారా పాఠకుడికి, ఒక మంచి పుస్తకానికి మధ్య ఉండే పుస్తకం ధర, పరిమాణం వంటి వాటన్నింటినీ తొలగించి, పుస్తక పఠనం వైపు నడిపించేందుకు కొత్త మార్గాలను సృష్టించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని పెంగ్విన్ రాండమ్ హస్ ఇండియా సేల్స్, ప్రాడక్ట్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ సట్టి వెల్లడించారు.ఆ 16 ప్రముఖ రచనలు ఇవే..పాకెట్ సైజులో మొదటగా ప్రముఖ భారతీయ రచనలతోపాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు రాసినవి కూడా ఉన్నాయి. భారతీయ రచనల్లో పండిట్ చంద్రధర్ శర్మ గులేరి రచన ‘ఉస్నే కహా థా’, ప్రేమ్ చంద్ కలం నుంచి జాలు వారిన ‘పంచ్ పరమేశ్వర్ ఔర్ అన్య కహానియా’, భర్తృహరి రచించిన ‘నీతి శతకం’, ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన ‘పితా కె పత్ర్’, మహాత్మాగాంధీ స్వీయ రచన ‘హింద్ స్వరాజ్’. ప్రపంచ సాహిత్య కేటగిరీలో.. విఖ్యాత రచయిత ఖలీల్ గిబ్రాన్ రాసిన ‘ది ప్రొఫెట్’, జార్జి ఆర్వెల్ ‘ఏనిమల్ ఫామ్’, చైనాకు చెందిన సైనికాధికారి, వ్యూహకర్త సన్ ట్జు రచన ది ఆర్ట్ ఆఫ్ వార్, ఫ్రాంజ్ కాఫ్కా రాసిన మెటామార్ఫాసిస్, చారెల్స్ డికెన్స్ రచన ఎ క్రిస్ట్మస్ కరోల్, ఫియోదొర్ దోస్తోయెస్కీ రాసిన వైట్ నైట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ విఖ్యాత రచన గీతాంజలి, ఆస్కార్ వైల్డ్ ‘ది ఇంపార్టాన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ సైన్స్ ఫిక్షన్ ‘డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్’, లియో టాల్‌స్టాయ్ ‘ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యీచ్’, స్వాతంత్య్రోద్యమం సమయంలో జైలు నుంచి కుమార్తె ఇందిరకు జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘లెటర్స్ ఫ్రం ఫాదర్’ఉన్నాయి. -
సోనియా ఆత్మకథ ముద్రణ హార్పర్ కాలిన్స్ చేతికి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ముద్రణ బాధ్యతలను హార్పర్ కాలిన్స్ ఇండియా చేపట్టింది. ముందుగా నిర్ణయించినట్టు ఈ పుస్తకం భారత్‌లో నవంబర్ 10నే విడుదల కానుంది. వాస్తవానికి ఈ పుస్తకాన్ని పెంగ్విన ర్యాండమ్ హౌస్ ప్రచురించాల్సి ఉండింది. అయితే కొన్ని అంశాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెంగ్విన్ తాము ఈ పుస్తకాన్ని ప్రచురించడం లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏర్పడ్డ అనిశ్చితి కాస్తా హార్పర్ కాలిన్స్ ఇండియా నిర్ణయంతో తొలగిపోయింది. చాలామంది ఎంతో ఆసక్తిగా రాజకీయ ఆత్మకథ కోసం ఎదురు చూస్తున్నారని.. ఇందులో నాటకీయత, వ్యక్తిగత అనుభవాలు, ప్రేమ, గుర్తింపు కోసం పోరాటం, బాధ్యతల వంటి అనేక కోణాలు ఆవిష్కృతమవుతాయిన హార్పర్ కాలిన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాతపత్రిలో కొన్ని మార్పులు చేసేందుకు నిరాకరించడంతో సోనియాగాందీకి, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చైనా ఆక్రమించిన భారత భూభాగానికి సంబంధించిన విభాగాలు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అంశాలను తొలగించాల్సిందిగా పెంగ్విన్ సోనియాను కోరినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటోందని ఆరోపించారు. మరోవైపు పెంగ్విన ఇండియా మాత్రం తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఒకానొక అంశంపై పడ్డ చిక్కుముడి వీడకపోవడంతో ప్రచురణ బాధ్యతల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేసింది. -
ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని అంటోంది.సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్.. పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.మూడు అంశాలే అసలు వివాదమా?కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్ ఆరోపణఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్.. పెంగ్విన్ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్ అలోక్.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.ఆత్మకథలో ఏముంది?‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీ భార్యగా భారత్‌కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.ఇక భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్‌కాలిన్స్ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్ అభ్యంతరాలపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కౌంటర్లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్! -
ప్రచురించేది మేము కాదు
న్యూఢిల్లీ: ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’భారత ప్రచురణకర్తలు తాము కాదని శుక్రవారం ప్రకటించింది. ‘‘చర్చలు జరుగుతున్నంత కాలం ఈ పుస్తక ప్రచురణపై తాము ఆసక్తిగానే ఉన్నామని... అయితే రచయితల ఫ్యాక్ట్ చెక్ చేయడం తమ బాధ్యత, నిర్ణయాధికారం’’అని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. కొన్ని వారాల క్రితమే పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇంప్రింట్గా పుస్తకాలు ప్రచురించే అమెరికన్ పబ్లిషర్ ఆ్రల్ఫెడ్ ఏ క్నాఫ్.. సోనియాగాంధీ ఆత్మకథ ఈ ఏడాది నవంబరు పదవ తేదీన విడుదల అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుస్తకంలో కొన్ని మార్పులు చేసేందుకు సోనియాగాంధీ నిరాకరించడంతో పెంగ్విన్ ప్రచురణ విషయంలో వెనక్కు తగ్గిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘‘బిలాంగింగ్ పుస్తకం భారత పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కాదు. అయితే పుస్తకంలో కొన్ని మార్పులు చేసేందుకు రచయిత నిరాకరించడం వల్ల పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తే... అది వాస్తవ పరిíస్థితులకు అద్దం పట్టేది కాదు’’అంటూ పెంగ్విన్ తన ప్రకటనలో తెలిపింది. ‘‘వాస్తవాలను సరిచూడటం, రచయిత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి సలహా, సూచనలు చేయడం ప్రచురణకర్తలుగా మా బాధ్యత, నిర్ణయాధికారం. ప్రచురణ ప్రక్రియలో ఇది సాధారణంగా జరిగేదే. చర్చలు కొనసాగినంత కాలం పెంగ్విన్ పుస్తక ప్రచురణపై ఆసక్తి కనబరిచింది’’అని వివరించింది. ఇంతకు మించి రచయితతో తాము జరిపిన చర్చల వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.... ప్రచురణ కర్త ఎవరో స్పష్టం కాకపోయినా ఈ పుస్తకం రూ.2615లకు ప్రీ ఆర్డర్ చేయవచ్చు అని ఈకామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో కనిపించడం!! ఇందులో ప్రచురణ కర్తగా యూకేకు చెందిన హార్పర్ కాలిన్స్ ఇన్‌ప్రింట్ ‘‘విలియం కోలిన్’’గా పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే: కాంగ్రెస్సోనియా గాంధీ ఆత్మకథను ప్రచురించే విషయంలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెనక్కు తగ్గడం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లేనని పలువురు కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇంప్రింట్ ఆ్రల్ఫెడ్ ఏ క్నాఫ్ ముద్రిస్తూండగా లేనిది భారత్‌లో పెంగ్విన్ ఇండియా ముద్రించకుండా ఎవరు ఆపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ విమర్శించారు. ‘‘ఒత్తిడి తీసుకొచ్చి నిలిపేయడం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛను హత్య చేయడంతో సమానం’’అని వ్యాఖ్యానించారు. మోదీ, ఆర్ఎస్ఎస్లకు సంబంధించిన సమాచారం, మోదీ హయాంలో చైనా భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన వైనాలను తొలగించాలని పెంగ్విన్ ఇండియాపై ఒత్తిడి వచి్చందని ఆరోపించారు. -
పదహారేళ్లకే పాపులారిటీ!
స్పందనకు వయసుతో సంబంధం లేదు... ఆకాశంలోని అందమైన హరివిల్లును చూసి ఆనందించడానికి, నెలవంక అందం గురించి అలవోకగా చెప్పడానికి వయసుతో సంబంధం లేదు! కానీ వాటికి అక్షరరూపం ఇవ్వడానికి అనుభవంతో కూడిన వయసుండాలి... అయితే, భావాలను వ్యక్తీకరించడానికి వయసుతో పనిలేదు, భాషపై తీవ్రమైన కసరత్తు చేయనక్కర్లేదు... ఆలోచన ఉంటే చాలు భావాన్ని అక్షరాల్లో వ్యక్తీకరించవచ్చు... అని అంటుందామె. అందుకు తగ్గట్టుగా 16 యేళ్ల వయసుకే 16 కథలతో ‘డియర్ డైరీ’ పేరుతో ఒక సంకలనం తెచ్చింది. ఇంగ్లిష్‌లో రచనలు సాగించిన ఆ తెలుగమ్మాయి పేరు వైష్ణవి మాగంటి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో 11వ తరగతి చదువుతున్న వైష్ణవి రచనా శైలిని మెచ్చి పెంగ్విన్ ర్యాండమ్హౌస్ అనే ప్రసిద్ధ పబ్లిషర్లు కథలను ప్రచురించారు. అమెజాన్‌డాట్‌కామ్ వంటి సైట్లో కూడా ఆ పుస్తకం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వైష్ణవితో ఇంటర్వ్యూ... తొలిసారిగా రచయిత్రిగా పేరును అచ్చురూపంలో చూసుకొన్నప్పుడు ఏమనిపించింది?! వైష్ణవి: నిజంగా కళ్ల నుంచి నీళ్లొచ్చేశాయి. ఫస్ట్ కాపీని చూడగానే భావోద్వేగాలకు లోనయ్యాను. చెల్లెలు జాహ్నవిని గట్టిగా హగ్ చేసుకొని ఆనందాన్ని పంచుకొన్నాను. అదంతా కొద్దిసేపే.. తర్వాత మామూలే. ఆనందమైనా, బాధ అయినా కొద్దిసేపే! రచయిత్రి కావడానికి స్ఫూర్తి ఏమిటి?! వైష్ణవి: నీకు నచ్చింది చెయ్యి... నీ డ్రీమ్స్‌ను ఫాలో అవ్వు... అంటూ అమ్మానాన్నలు జయశ్రీ, బలరాంలు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను రచనావ్యాసంగం వైపు నడిపించింది. చిన్నప్పటి నుంచి చాలా చిన్న సంఘటనకైనా భావోద్వేగ పూరితంగా స్పందించడం అలవాటు. చిన్న చిన్న అనుభవాలను కూడా ప్రత్యేకంగా చూడటమే నన్ను రచయిత్రిని చేసింది. తొలి రచన ఎప్పుడు చేశారు? వైష్ణవి: ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే రాయడం అలవాటు. నాకున్న ఇమాజినేషన్‌తో డిటెక్టివ్, మిస్టరీ కథలను రాసే దాన్ని... అయితే వాటికి పేర్లు మాత్రం పెట్టేదాన్ని కాదు. రాసిన వాటిని ఎలా భద్రం చేసేవారు? వైష్ణవి: ఇంతవరకూ కథలేవీ పబ్లిష్ కాలేదు. మామయ్య బహుమతిగా ఇచ్చిన పెన్‌తో రాయడం, ఇంట్లో వాళ్లకు చూపించడం... వాళ్లే నా కథలకు పాఠకులు. జాహ్నవి వాటిని టైప్ చేసి పెట్టేది. ఇప్పటివరకూ ఎన్నికథలు రాశారు? అచ్చువేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వైష్ణవి: చాలానే రాశాను. రాసిన వాటిలో బెస్ట్ 16ని తీసుకొని పుస్తకంగా తీసుకురావాలని అనుకొన్నాను. ఆ పదహారే ఎందుకంటే.. ఇప్పుడు నా వయసు 16. పుస్తకాన్ని చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవడానికి అలా చేశాను. నా కథలను పబ్లిష్ చేయాలన్న ఆలోచన కూడా ఎన్నో రోజులుగా ఉన్నదే. అయితే అది చాలా కష్టంతో కూడుకొన్నది అనుకొన్నాను. కానీ ఇంత సులభంగా సాధ్యమవుతుందని అనుకోలేదు! మరి అంత సులభంగా పబ్లిషర్స్ ఎలా దొరికారు?! వైష్ణవి: ఆన్లైన్లో ఆ పబ్లిషర్ల గురించి తెలుసుకొని మెయిల్ ద్వారా సంప్రదించాను. వారి నుంచి ఫోన్ వచ్చింది. నా కథల గురించి వివరించాను. రాతప్రతులను పంపితే ఓకే చేశారు. పబ్లిష్ చేసి పుస్తకం నా చేతిలో పెట్టారు! కేవలం రెండు నెలల్లోనే మొత్తం పని పూర్తి అయ్యింది. మీ పుస్తకం అమెజాన్డాట్కామ్లో కూడా అమ్మకానికి ఉంచారు కదా, ఏమనిపించింది?! వైష్ణవి: పెద్ద పెద్ద రచయితల పుస్తకాలను అమ్మకానికి ఉంచే అమెజాన్‌లో నా బుక్ ఉందనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఈ వయసులో చాలా తక్కువ మందికే ఇది సాధ్యం అవుతుందని అందరూ పొగిడేస్తున్నారు. వింటున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ గర్వం మాత్రం లేదు... ‘డియర్డైరీ’ అనే పేరెందుకు పెట్టారు? వైష్ణవి: నాకు ఇష్టంగా రాసుకొన్న డైరీ లాంటివి ఈ కథలన్నీ. అందుకే ఆ పేరు. ఈ కథలన్నింటిలో మీకు బాగా ఇష్టమైనది? వైష్ణవి: అమ్మ గురించి రాసిన ‘మై హ్యాపీ మీల్’. అలాగే అమ్మమ్మ, తాతయ్యల గురించి రాసిన ‘ద నోట్’ నాకు బాగా ఇష్టం. కథలేనా? కవితలూ ఇంకా ఏమైనా రాస్తుంటారా? వైష్ణవి: ‘హార్ట్ఫాంట్’ పేరుతో ఒక బ్లాగ్ ఉంది. అందులో కోట్స్, కవిత్వం, నా ఆలోచనల గురించి రాస్తుంటాను.. పుస్తకాలు బాగా చదువుతారా? ఇష్టమైన రచయిత ఎవరు? వైష్ణవి: రచయితలు నికోలస్ స్పార్క్, జేకే రౌలింగ్, చేతన్ భగత్...లు బాగా ఇష్టం. మిస్టరీ, రొమాన్స్, ఫిక్షన్ బాగా ఇష్టంగా చదువుతాను. రాయడానికి ప్రత్యేకమైన మూడ్ అవసరమా?! వైష్ణవి: కచ్చితంగా... మంచి వాతావరణంలో మనసు స్వేచ్ఛగా స్పందిస్తుంది. అలాంటప్పుడు నాలోని భావాలు స్వచ్ఛంగా, సహజంగా జనిస్తాయి. రచయిత్రిగా స్థిరపడే ఉద్దేశం ఉందా?! వైష్ణవి: రాయాలనే ఉద్దేశం కన్నా ముందు రాసే శక్తి ఉందని భావిస్తున్నాను. పాఠకుడితో కనెక్ట్ అయ్యేలా భావాలు పలికించే శక్తి నాకు ఉందనే ఆత్మవిశ్వాసం ఉంది. పూర్తిస్థాయి రచయిత్రిగా స్థిరపడటానికి అదే నా ప్లస్ పాయింట్! - జీవన్‌రెడ్డి.బి


