ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!? | Sonia Gandhi Memoir Row: 3 Flashpoints Behind Penguin Indias Exit | Sakshi
Sakshi News home page

ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?

Aug 29 2026 12:18 PM | Updated on Aug 29 2026 12:22 PM

Sonia Gandhi Memoir Row: 3 Flashpoints Behind Penguin Indias Exit

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్‌ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్‌ వెనక్కి తగ్గిందని అంటోంది.

సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్‌ ఏ. నాఫ్‌.. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.

మూడు అంశాలే అసలు వివాదమా?
కాంగ్రెస్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్‌ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్‌ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.

‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్‌ ఆరోపణ
ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగోయ్‌.. పెంగ్విన్‌ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.

‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్‌
కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్‌ కేసవన్‌ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్‌ అలోక్‌.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.

ఆత్మకథలో ఏముంది?
‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్‌ గాంధీ భార్యగా భారత్‌కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.

ఇక భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్‌ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్‌కాలిన్స్‌ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్‌ అభ్యంతరాలపై కాంగ్రెస్‌-బీజేపీ మధ్య కౌంటర్‌లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్‌ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్‌ ఇండియా భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్‌ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement