ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం! | Farakka Water Dispute India Bangladesh and the Multi-State Battle for the Ganga | Sakshi
Sakshi News home page

ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం!

Aug 29 2026 7:19 AM | Updated on Aug 29 2026 7:19 AM

Farakka Water Dispute India Bangladesh and the Multi-State Battle for the Ganga

పశ్చిమ బెంగాల్‌లో గంగా నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజీ జలాల గమనాన్నే కాదు.. రెండు దేశాల సంబంధాలు, రెండు రాష్ట్రాల భవితవ్యాన్నీ సమూలంగా మార్చేసింది. కోల్‌కతా పోర్టును కాపాడేందుకు రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు 1996 నాటి చారిత్రక 30 ఏళ్ల ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుండటంతో పెను వివాదం రాజుకుంది. బీహార్ వరదలు, పశ్చిమ బెంగాల్ పోర్టు మనుగడ, బంగ్లాదేశ్ నీటి అవసరాల మధ్య ఫరక్కా నీటిపై అసలు హక్కు ఎవరిదన్న ప్రశ్న ఇప్పుడు రచ్చ లేపుతోంది.

కోల్‌కతా పోర్టు రక్షణకే ఆనాడు పునాది
హుగ్లీ నదిలో పేరుకుపోతున్న విపరీతమైన పూడిక కారణంగా నది లోతు తగ్గి, భారీ నౌకలు కోల్‌కతా పోర్టుకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 1853లోనే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించినట్లుగా.. గంగా నది నీటిని హుగ్లీ వైపు మళ్లిస్తే పూడిక కొట్టుకుపోయి పోర్టు నిరంతరం పనిచేస్తుందని నిపుణులు నిర్ణయించారు. దీని ఫలితంగానే 1975లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో, బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 16-18 కిలోమీటర్ల ఎగువన 109 గేట్లతో 2.25 కిలోమీటర్ల పొడవైన ఫరక్కా బ్యారేజీని నిర్మించారు. ఇక్కడి నుంచి 38-42 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా గంగ నీటిని భాగీరథి-హుగ్లీ నదిలోకి మళ్లించడం ప్రారంభించారు.

నీటి కొరతతో రగిలిన వివాదం
ఫరక్కా నుంచి హుగ్లీ వైపు నీటిని మళ్లించడంతో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే పద్మా నదిలో ప్రవాహం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, మత్స్య సంపద, తాగునీరు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమస్య భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ దౌత్య వివాదానికి దారితీసింది. 1977, 1980లలో తాత్కాలిక ఏర్పాట్లు జరిగినప్పటికీ, చివరకు 1996 డిసెంబర్ 12న నాటి భారత ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య 30 ఏళ్ల కాలపరిమితితో ‘గంగా జలాల పంపకాల ఒప్పందం’ కుదిరింది.

1996 నాటి పంపకాల ఫార్ములా ఇదే
ఈ చారిత్రక ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1 నుంచి మే 31 వరకు ఉండే ఎండాకాలంలో నీటి పంపకాలను పక్కాగా నిర్వచించారు. ఫరక్కా వద్ద 70,000 క్యూసెక్కులు లేదా అంతకంటే తక్కువ నీరు లభిస్తే ఇరు దేశాలు చెరిసగం పంచుకోవాలి. 70,000 నుంచి 75,000 క్యూసెక్కుల లభ్యత ఉంటే బంగ్లాదేశ్‌కు 35,000 క్యూసెక్కులు ఇచ్చి మిగిలినది భారత్ తీసుకోవాలి. 75,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంటే భారత్‌కు 40,000 క్యూసెక్కులు కేటాయించి మిగిలినది బంగ్లాదేశ్‌కు విడుదల చేయాలి. మార్చి-మే మధ్య ఇరు దేశాలకు వంతులవారీగా 35,000 క్యూసెక్కుల కనీస ప్రవాహాన్ని ఇచ్చే గ్యారెంటీని కూడా ఇందులో చేర్చారు.

బంగ్లాదేశ్ కొత్త డిమాండ్లు.. అంతర్జాతీయ ఒత్తిడి
సుదీర్ఘకాలం సాఫీగానే సాగిన ఈ వ్యవస్థలో బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాక తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా పెరగడం, వాతావరణ మార్పులు, వర్షపాత లేమి దృష్ట్యా తమకు మరింత ఎక్కువ నీరు కావాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఎగువ దేశం నుంచి నిర్ణీత పరిమాణంలో నీటి విడుదలను తప్పనిసరి చేసే ‘గ్యారెంటీ క్లాజ్’ కొత్త ఒప్పందంలో ఉండాలని ఆ దేశ జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి అనీ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్తామని బంగ్లాదేశ్ హెచ్చరిస్తోంది.

వరదల శాపంతో రగులుతున్న బీహార్
ఫరక్కా బ్యారేజీ కారణంగా ఎగువన పేరుకుపోతున్న అపారమైన పూడికతో గంగా నది గర్భం ఎత్తు పెరిగి, భాగల్పూర్, ముంగేర్ తదితర బీహార్ జిల్లాల్లో ఏటా తీవ్ర వరద ముంపు సంభవిస్తోందని ఆ రాష్ట్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2016లోనే అప్పటి సీఎం నితీశ్ కుమార్ ఫరక్కా బ్యారేజీని కూల్చివేయడమే సమస్యకు పరిష్కారమని వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో బంగ్లాదేశ్‌కు నీరు వదలాల్సి రావడంతో బీహార్‌లో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని జేడీయూ నేత సంజయ్ ఝా, ఎంపీ సుధాకర్ సింగ్ తదితరులు వాదిస్తున్నారు. 2050 జనాభా అవసరాలు, వరద నియంత్రణ, జల రవాణాను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ఒప్పందాన్ని పునరుద్ధరించరాదని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రానికి పెను సవాలు
పశ్చిమ బెంగాల్‌కు ఫరక్కా మనుగడ అత్యంత కీలకం. బంగ్లాదేశ్‌కు ఎక్కువ నీరు ఇస్తే హుగ్లీకి సరిపడా నీరు అందక కోల్‌కతా, హల్దియా పోర్టుల నిర్వహణ దెబ్బతింటుందని ఆ రాష్ట్రం ఆందోళన చెందుతోంది. ఇటీవల పెరిగిన వరదలతో బీహార్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఫరక్కా గేట్లన్నీ ఎత్తాలని బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చించారు. 2026 డిసెంబర్ గడువు ముంచుకొస్తున్న తరుణంలో.. ఈ సమస్య కేవలం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అంశంగా మాత్రమే కాక, బీహార్ వర్సెస్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ముక్కోణపు ప్రయోజనాల సంఘర్షణగా మారింది. ఈ మూడు పక్షాల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ కొత్త ఒప్పందాన్ని కొలిక్కి తేవడం కేంద్ర ప్రభుత్వానికి పెను పరీక్షగా మారింది.

ఇది కూడా చదవండి: సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement