breaking news
Treaty
-
ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం!
పశ్చిమ బెంగాల్లో గంగా నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజీ జలాల గమనాన్నే కాదు.. రెండు దేశాల సంబంధాలు, రెండు రాష్ట్రాల భవితవ్యాన్నీ సమూలంగా మార్చేసింది. కోల్‌కతా పోర్టును కాపాడేందుకు రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు 1996 నాటి చారిత్రక 30 ఏళ్ల ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుండటంతో పెను వివాదం రాజుకుంది. బీహార్ వరదలు, పశ్చిమ బెంగాల్ పోర్టు మనుగడ, బంగ్లాదేశ్ నీటి అవసరాల మధ్య ఫరక్కా నీటిపై అసలు హక్కు ఎవరిదన్న ప్రశ్న ఇప్పుడు రచ్చ లేపుతోంది.కోల్‌కతా పోర్టు రక్షణకే ఆనాడు పునాదిహుగ్లీ నదిలో పేరుకుపోతున్న విపరీతమైన పూడిక కారణంగా నది లోతు తగ్గి, భారీ నౌకలు కోల్‌కతా పోర్టుకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 1853లోనే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించినట్లుగా.. గంగా నది నీటిని హుగ్లీ వైపు మళ్లిస్తే పూడిక కొట్టుకుపోయి పోర్టు నిరంతరం పనిచేస్తుందని నిపుణులు నిర్ణయించారు. దీని ఫలితంగానే 1975లో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో, బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 16-18 కిలోమీటర్ల ఎగువన 109 గేట్లతో 2.25 కిలోమీటర్ల పొడవైన ఫరక్కా బ్యారేజీని నిర్మించారు. ఇక్కడి నుంచి 38-42 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా గంగ నీటిని భాగీరథి-హుగ్లీ నదిలోకి మళ్లించడం ప్రారంభించారు.నీటి కొరతతో రగిలిన వివాదంఫరక్కా నుంచి హుగ్లీ వైపు నీటిని మళ్లించడంతో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే పద్మా నదిలో ప్రవాహం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, మత్స్య సంపద, తాగునీరు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమస్య భారత్-బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘ దౌత్య వివాదానికి దారితీసింది. 1977, 1980లలో తాత్కాలిక ఏర్పాట్లు జరిగినప్పటికీ, చివరకు 1996 డిసెంబర్ 12న నాటి భారత ప్రధాని హెచ్డీ దేవెగౌడ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య 30 ఏళ్ల కాలపరిమితితో ‘గంగా జలాల పంపకాల ఒప్పందం’ కుదిరింది.1996 నాటి పంపకాల ఫార్ములా ఇదేఈ చారిత్రక ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1 నుంచి మే 31 వరకు ఉండే ఎండాకాలంలో నీటి పంపకాలను పక్కాగా నిర్వచించారు. ఫరక్కా వద్ద 70,000 క్యూసెక్కులు లేదా అంతకంటే తక్కువ నీరు లభిస్తే ఇరు దేశాలు చెరిసగం పంచుకోవాలి. 70,000 నుంచి 75,000 క్యూసెక్కుల లభ్యత ఉంటే బంగ్లాదేశ్‌కు 35,000 క్యూసెక్కులు ఇచ్చి మిగిలినది భారత్ తీసుకోవాలి. 75,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉంటే భారత్‌కు 40,000 క్యూసెక్కులు కేటాయించి మిగిలినది బంగ్లాదేశ్‌కు విడుదల చేయాలి. మార్చి-మే మధ్య ఇరు దేశాలకు వంతులవారీగా 35,000 క్యూసెక్కుల కనీస ప్రవాహాన్ని ఇచ్చే గ్యారెంటీని కూడా ఇందులో చేర్చారు.బంగ్లాదేశ్ కొత్త డిమాండ్లు.. అంతర్జాతీయ ఒత్తిడిసుదీర్ఘకాలం సాఫీగానే సాగిన ఈ వ్యవస్థలో బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాక తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా పెరగడం, వాతావరణ మార్పులు, వర్షపాత లేమి దృష్ట్యా తమకు మరింత ఎక్కువ నీరు కావాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఎగువ దేశం నుంచి నిర్ణీత పరిమాణంలో నీటి విడుదలను తప్పనిసరి చేసే ‘గ్యారెంటీ క్లాజ్’ కొత్త ఒప్పందంలో ఉండాలని ఆ దేశ జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి అనీ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్తామని బంగ్లాదేశ్ హెచ్చరిస్తోంది.వరదల శాపంతో రగులుతున్న బీహార్ఫరక్కా బ్యారేజీ కారణంగా ఎగువన పేరుకుపోతున్న అపారమైన పూడికతో గంగా నది గర్భం ఎత్తు పెరిగి, భాగల్పూర్, ముంగేర్ తదితర బీహార్ జిల్లాల్లో ఏటా తీవ్ర వరద ముంపు సంభవిస్తోందని ఆ రాష్ట్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2016లోనే అప్పటి సీఎం నితీశ్ కుమార్ ఫరక్కా బ్యారేజీని కూల్చివేయడమే సమస్యకు పరిష్కారమని వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో బంగ్లాదేశ్‌కు నీరు వదలాల్సి రావడంతో బీహార్‌లో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని జేడీయూ నేత సంజయ్ ఝా, ఎంపీ సుధాకర్ సింగ్ తదితరులు వాదిస్తున్నారు. 2050 జనాభా అవసరాలు, వరద నియంత్రణ, జల రవాణాను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ఒప్పందాన్ని పునరుద్ధరించరాదని డిమాండ్ చేస్తున్నారు.కేంద్రానికి పెను సవాలుపశ్చిమ బెంగాల్‌కు ఫరక్కా మనుగడ అత్యంత కీలకం. బంగ్లాదేశ్‌కు ఎక్కువ నీరు ఇస్తే హుగ్లీకి సరిపడా నీరు అందక కోల్‌కతా, హల్దియా పోర్టుల నిర్వహణ దెబ్బతింటుందని ఆ రాష్ట్రం ఆందోళన చెందుతోంది. ఇటీవల పెరిగిన వరదలతో బీహార్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఫరక్కా గేట్లన్నీ ఎత్తాలని బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చించారు. 2026 డిసెంబర్ గడువు ముంచుకొస్తున్న తరుణంలో.. ఈ సమస్య కేవలం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అంశంగా మాత్రమే కాక, బీహార్ వర్సెస్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ముక్కోణపు ప్రయోజనాల సంఘర్షణగా మారింది. ఈ మూడు పక్షాల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ కొత్త ఒప్పందాన్ని కొలిక్కి తేవడం కేంద్ర ప్రభుత్వానికి పెను పరీక్షగా మారింది.ఇది కూడా చదవండి: సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా! -
పాక్‌పై అపార దయ చూపిన భారత్
ఇస్లామాబాద్: భారత్ తన పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలో ఎంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నదనడానికి మరో నిదర్శనం మన ముందు నిలిచింది. ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య పెరిగిన దౌత్య ఉద్రిక్తతల నడుమ కూడా పాకిస్తాన్‌పై భారత్ దయ చూపింది. పాక్‌లో ప్రవహించే తావి నదిలో వరద పరిస్థితిపై ఇస్లామాబాద్‌ను హెచ్చరించింది.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను నిలిపివేసింది. అయినప్పటికీ భారత్ తన దయాహృదయాన్ని చాటుతూ.. తాజాగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా తావి నది ఉధృతిపై పాక్‌ను అప్రమత్తం చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇటు భారత్ అటు పాకిస్తాన్‌లు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ వాదనలు నిజమైతే, ఉద్రిక్తతల దరిమిలా భారత్ తన దౌత్య మిషన్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.జమ్ములోని తావి నదిలో పెద్దఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉందని భారత్.. పాకిస్తాన్‌ను హెచ్చరించిందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని సమాచారం. భారతదేశం అందించిన సమాచారం ఆధారంగానే పాకిస్తాన్ సంబంధిత అధికారులకు ఈ విషయం చేరవేసిందని తెలుస్తోంది. టిబెట్‌లో ప్రారంభమైన సింధూ నది ప్రవాహం పాకిస్తాన్ అంతటా ప్రయాణిస్తుంది. కశ్మీర్ మీదుగానూ వెళుతుంది.ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధూ జల ఒప్పందం 1960లో కుదిరింది. ఇది భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ నది, దాని ఉపనదుల వాడకాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ ఒప్పందం కింద భారతదేశానికి సింధూ నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీరు, మిగిలిన 80 శాతం నీరు పాకిస్తాన్‌కు అందుతుంది. ఏప్రిల్ 22న చోటుచేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటి నుంచి ఈ నదికి సంబంధించిన మూడు ఉప నదులలోని నీటి మట్టాల డేటాను పాకిస్తాన్‌తో పంచుకోవడం ఆపివేసింది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మూడు నదులలో నీటి మట్టం పెరుగుతున్నదని పాక్‌కు భారత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో, ఆ దేశం.. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వర్షాకాలంలో పాకిస్తాన్ అంతటా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరదలు, భారీ వర్షాల కారణంగా పాక్‌లో ఇప్పటివరకూ 788 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా జనం గాయపడ్డారు. మృతులలో 200 మంది పిల్లలు, 117 మంది మహిళలు, 471 మంది పురుషులు ఉన్నారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. -
‘బ్రెగ్జిట్’కు పార్లమెంటులో చుక్కెదురు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంలో(బ్రెగ్జిట్) తుది ఒప్పందాన్ని నిలుపుదల లేదా జాప్యం చేసేందుకు పార్లమెంటుకు అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ఈయూ (సవరణ) బిల్లుకు ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ గురువారం ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఎగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 355, వ్యతిరేకంగా 244 ఓట్లు పడ్డాయి. దీంతో ఈయూతో మరోసారి చర్చలు జరపమని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు పార్లమెంటుకు అధికారం ఏర్పడుతుంది. అలాగే తుది ఒప్పందం నచ్చకపోతే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని కూడా నిలువరించవచ్చు. బ్రెగ్జిట్‌పై పార్లమెంటుకు ఎన్ని హామీలు ఇచ్చినా హౌస్ ఆఫ్ లార్డ్స్ సవరణలకు అనుకూలంగా ఓటు వేయడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని బ్రిటన్ మంత్రి మార్టిన్ కల్లనాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
‘ట్రీటీ’తో బురిడీ...!
♦ ఇండోనేషియా నుంచి అక్రమంగా బంగారం దిగుమతి ♦ రెండేళ్లలో వివిధ దఫాల్లో దాదాపు 400 కేజీల పైనే ♦ భారత్‌కు ఇండోనేషియాతో ఉన్న ఒప్పందంతో మాయ ♦ కస్టమ్స్ కళ్లుగప్పిన చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి ♦ నోటీసుల జారీకి కస్టమ్స్ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: ఇండోనేషియా నుంచి రెండేళ్లలో 400 కేజీల పసిడి దిగుమతి.. ఆన్ రికార్డు ప్రకారం అంతా క్లీన్.. కానీ రెండేళ్లలో ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు రావడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆరా తీయగా.. ‘ట్రీటీ’(ఒప్పందం) పేరుతో బురిడీ కొట్టించినట్టు తేలింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఓ పసిడి వ్యాపారి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి 400 కేజీల గోల్డ్‌స్కామ్ దందా నడిపినట్టు గుర్తించారు. ట్రీటీని అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి.. బంగారం సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపైనా నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ(పన్ను) చెల్లించాలి. అయితే అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య లావాదేవీలతో పాటు అనేక కారణాల నేపథ్యంలో భారత్ కొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందం చేసుకున్న దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పూర్తి స్థాయిలో/నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. బంగారంతో పాటు కొన్ని రకాల వస్తువుల దిగుమతికి సంబంధించి భారత్‌కు ఇండోనేషియాతో ఒప్పందం ఉంది. దీని ప్రకారం సదరు బంగారం, వస్తువు ఆ దేశంలోనే తయారైందని ధ్రువీకరణ పత్రంతో దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా ఇదే ఒప్పందాన్ని చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా ఇండోనేషియా నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్న సదరు వ్యాపారి.. అధికారిక ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆన్ రికార్డ్ అన్నీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రెండేళ్లలో 400 కేజీల వరకు దిగుమతి.. ఇండోనేషియా నుంచి బంగారాన్ని కడ్డీలు, దిమ్మెల రూపంలో తెచ్చుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కచ్చితంగా ఆభరణాలుగానే దిగుమతి చేసుకోవాలి. దీంతో ఇండోనేషియాలోనే కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యాపారి కడ్డీలు, దిమ్మెలను నామ్‌కే వాస్తేగా రింగుల రూపంలోకి మార్చి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు వస్తుండటం, రెండేళ్లలో పలు దఫాల్లో 400 కేజీల వరకు దిగుమతి కావడంతో కస్టమ్స్ అధికారులకు సందేహం వచ్చింది. ఆరా తీయాలని ఢిల్లీలోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయాన్ని(సీబీఈసీ)కోరారు. దీంతో ప్రత్యేక అధికారిని ఇండోనేషియా పంపి ఆరా తీయగా.. పసిడి వ్యా పారి చెపుతున్నట్లుగా బంగారం ఆ దేశానికి చెందినది కాద ని తేలింది. ఏజెంట్ల సహకారంతో దుబాయ్, సౌదీ వంటి దేశాల నుంచి ఇండోనేషియాకు తరలించి, అక్కడ అధికారిక ధ్రువీకరణ పత్రాలు పుట్టించి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువస్తూ సుంకం ఎగ్గొడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో 400 కేజీల పసిడిపై పన్ను చెల్లించాల్సిన సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేయడానికి కస్టమ్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఈ తరహా వ్యాపారం చేసే ముఠాలు మరికొన్ని ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుపుతోంది.


