
ఇస్లామాబాద్: భారత్ తన పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలో ఎంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నదనడానికి మరో నిదర్శనం మన ముందు నిలిచింది. ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య పెరిగిన దౌత్య ఉద్రిక్తతల నడుమ కూడా పాకిస్తాన్‌పై భారత్ దయ చూపింది. పాక్‌లో ప్రవహించే తావి నదిలో వరద పరిస్థితిపై ఇస్లామాబాద్‌ను హెచ్చరించింది.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)ను నిలిపివేసింది. అయినప్పటికీ భారత్ తన దయాహృదయాన్ని చాటుతూ.. తాజాగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా తావి నది ఉధృతిపై పాక్‌ను అప్రమత్తం చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇటు భారత్ అటు పాకిస్తాన్‌లు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ వాదనలు నిజమైతే, ఉద్రిక్తతల దరిమిలా భారత్ తన దౌత్య మిషన్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.
జమ్ములోని తావి నదిలో పెద్దఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉందని భారత్.. పాకిస్తాన్‌ను హెచ్చరించిందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని సమాచారం. భారతదేశం అందించిన సమాచారం ఆధారంగానే పాకిస్తాన్ సంబంధిత అధికారులకు ఈ విషయం చేరవేసిందని తెలుస్తోంది. టిబెట్‌లో ప్రారంభమైన సింధూ నది ప్రవాహం పాకిస్తాన్ అంతటా ప్రయాణిస్తుంది. కశ్మీర్ మీదుగానూ వెళుతుంది.
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధూ జల ఒప్పందం 1960లో కుదిరింది. ఇది భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ నది, దాని ఉపనదుల వాడకాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ ఒప్పందం కింద భారతదేశానికి సింధూ నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీరు, మిగిలిన 80 శాతం నీరు పాకిస్తాన్‌కు అందుతుంది. ఏప్రిల్ 22న చోటుచేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటి నుంచి ఈ నదికి సంబంధించిన మూడు ఉప నదులలోని నీటి మట్టాల డేటాను పాకిస్తాన్‌తో పంచుకోవడం ఆపివేసింది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మూడు నదులలో నీటి మట్టం పెరుగుతున్నదని పాక్‌కు భారత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో, ఆ దేశం.. పంజాబ్, సింధ్ ప్రావిన్సులలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
వర్షాకాలంలో పాకిస్తాన్ అంతటా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరదలు, భారీ వర్షాల కారణంగా పాక్‌లో ఇప్పటివరకూ 788 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా జనం గాయపడ్డారు. మృతులలో 200 మంది పిల్లలు, 117 మంది మహిళలు, 471 మంది పురుషులు ఉన్నారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది.