Jyotirao Phule Death Anniversary 19వ శతాబ్దంలో జ్యోతిరావు ఫూలే సమకాలీన కుల, లింగ వివక్ష లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మొత్తం భారత సామాజిక చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా నిలిచింది. 1827లో మహా రాష్ట్రలో గోవిందరావు, చిన్నాబాయి దంపతులకు జన్మించిన ఫూలే విద్యార్థిగా ఉన్నప్పుడు ‘అమెరికా స్వతంత్ర ఉద్యమం’, ‘శివాజీ జీవిత చరిత్ర’, థామస్ పెయిన్ రచన ‘మానవుని హక్కులు’, జాన్ స్టువర్ట్ రాసిన ‘స్వతంత్రం’ వంటివి ప్రభావితం చేశాయి.
ఫూలే జీవితంలో ఒక అసాధారణ సంఘటన, ఆయన భవి ష్యత్ జీవితాన్ని సామాజిక సేవకు అంకితమయ్యేటట్లుగా మార్చింది. తన బ్రాహ్మణ మిత్రుని ఆహ్వానం మేరకు అతడి పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు బ్రాహ్మణులు ఫూలేను పక్కకు నెట్టివేసి కులం పేరుతో దూషించారు. ‘శూద్రుడివి ఈ ఊరేగింపులో పాల్గొనడానికి ఎంత ధైర్యం?’ అని అవమానించారు. ఈ అవమానం గురించి తన తండ్రికి వివరించాడు. తండ్రి కొడుకును బుజ్జగిస్తూ... పీష్వాల పాలనలో ఇది మామూలే అని చెప్పాడు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి శూద్రులు విద్యావంతులు అవ్వడం ఒక్కటే మార్గమని ఆయన భావించారు. ఉన్నత కులాలకు సంబంధించిన సామాజిక సమస్యలైన సతీసహగమనం వంటి ఆచారాలనూ ఆయన వ్యతిరేకించారు. భర్త మరణించిన స్త్రీలు, అనాథ బాలల పునరావాసానికి అంకితభావంతో పనిచేశారు. స్త్రీ విద్యకోసం పాఠశాలలను ఏర్పాటు చేశారు. తన భార్య సావిత్రీబాయికి తనే చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తయారు చేసి, ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.
ఫూలే తన సంస్థల నిర్వహణకు అవసరమైన ఆదాయ ఆర్జనకు కొంత కాలం క్వారీ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అర్జీలను, విన్నపాలను బ్రిటిష్ గవర్నమెంట్‌కు సమర్పించారు. అమాయకు లైన కార్మికులను చైతన్యవంతులుగా మార్చడానికి వారికి అర్థమయ్యే భాషలో క్వారీల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలను రాశారు. ‘సత్యశోధక సమాజ్’ అనే సంస్థను 1873లో స్థాపించి దాని ద్వారానే శూద్రులకు విద్యను అందించడానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సమాజ సేవకు మెచ్చిన ప్రజలు ‘మహాత్మా’ అనే బిరుదునిచ్చారు. ఆ అవిశ్రాంత పోరాట యోధుడి స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోనిది.
– కిరణ్ ముదిరాజ్ ‘ హైదరాబాద్
(నేడు జ్యోతిబా ఫూలే వర్ధంతి)


