కర్ణాటక: భర్త వేధింపులను తట్టుకోలేక భద్రా నీటి కాలువలోకి దూకిందో నవ వివాహిత. జిల్లాలో భద్రావతి తాలూకా సిద్ధాపుర వద్ద ఈ సంఘటన జరిగింది. తన బాధను హృదయవిదారకంగా డెత్‌నోట్‌లో రాసిపెట్టింది. వివరాలు... భద్రావతి తాలూకా డీబీ హళ్లికిచెందిన పరమేశ్వర, రుద్రమ్మ దంపతుల కుమార్తె లత (22). ఈ ఏడాది ఏప్రిల్‌లో శికారిపుర తాలూకా దిండదహళ్లి గ్రామానికి చెందిన గురురాజ్‌తో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లిచేశారు. విద్యుత్ శాఖ (కేపీసీఎల్)లో గురురాజ్ ఏఈఈగా ఉద్యోగం చేస్తాడు. పెద్ద ఉద్యోగి దొరికాడు అని భార్య, అత్తమామలు సంతోషిస్తే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక బుధవారం కాలువ వద్దకు చేరుకుని మొబైల్‌ఫోన్ గట్టున పెట్టి దూకేసింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
డెత్‌నోట్‌లో కన్నీటి వరద
మెట్టినింట్లో వేధింపుల గురించి లత డెత్‌నోట్‌లో వివరంగా రాసింది. నా చావుకు భర్త గురురాజ్, అత్త నాగరత్నమ్మ, బంధువులు రాజేశ్వరి, శారదమ్మ, కృష్ణప్ప కారణం. ఈ ఐదుగురు నన్ను మానసికంగా వేధించారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని పొంగిపోయాను, కానీ అతడు తల్లిదండ్రుల మాటలు విని నాతో నాటకీయంగా ప్రవర్తించేవాడు. ఎన్నో అవమానాలు అనుభవించాను. ప్రతి మహిళ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి భర్త దొరకడు. ఎన్నో కలలతో అత్తింటిలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ సర్దుకుపోవాలి. భార్యకు కనీసం భర్త అయినా మద్దతుగా ఉండాలి. ఇంట్లోని వారితో పాటు భర్త కూడా ద్వేషం చూపిస్తే ఆ మహిళకు చావుతో సమానం. రోజురోజుకీ చస్తూ బతకడం సాధ్యం కాదు. నా చావుకు న్యాయం చేయాలి అని చివరి కోరిక కోరింది.


