సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ పైరసీ కేసులో దర్యాప్తు పురోగతిపై అడిషనల్ సీపీ(క్రైమ్స్) శ్రీనివాసులు మంగళవారం మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రవిని ఎలా ట్రాప్ చేశారు? అతని నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? తదితర వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
..‘‘నిఖిల్ అనే వ్యక్తి రవికి మిత్రుడు. పైరసీ వెబ్‌సైట్‌కు డిజైన్లు తయారు చేసేవాడు. అతని ద్వారానే రవిని ట్రాప్ చేశాం. గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌తోనూ నిందితుడు బోలెడు డబ్బు సంపాదించాడు. యాడ్ బుల్ అనే కంపెనీ రవికి చెందిందే. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బ వచ్చేది. రవి సర్వర్లన్నీ నెదరలాండ్స్‌లో ఉన్నాయి. రవి టీం ఇంకా కరేబియనలోనే ఉంది. హైదరాబాద్, వైజాగ్‌లో రవి ఆస్తుల్ని గుర్తించాం. ఇప్పటిదాకా రూ.3 కోట్లు సీజ్ చేశాం’’ అని తెలియజేశారాయన.
ఐబొమ్మ డొమైన్‌ని ఎన్ జిలా(N Jila) అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడు. మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మ, బప్పమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేశాడు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్ వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారు. తద్వారా రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళ్లేది. అక్కడ వాటి యాడ్‌లను.. యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయి. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇమ్మడి రవి ఖాతాలోకి వెళ్లేది’’ అని తెలిపారాయన.
మరో వారం కస్టడీకి ఇవ్వండి!
ఐబొమ్మ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి వారంపాటు రవిని కస్టడీకి కోరారు. విచారణకు రవి సహకరించలేదని.. మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడతామని మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ కాపీలు ఇవ్వొద్దంటూ పోలీసుల మెమో దాఖలు చేశారు. దీని వల్ల కస్టడీ విచారణ నీరుగారుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయితే కస్టడీ పిటిషన్‌పై రేపు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.


