సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో తాజా పరిణామాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సా ప్రాంగణంలో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి రావడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు.
బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలక ఆధారాల్ని వెలికితీసింది. సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ పిండి మరతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించింది. ఈ ఘటనపై ఒవైసీ స్పందించారు.
‘మదర్సాలో ఒక గదిని కూడా నిర్మించలేని మూర్ఖులు బాంబులు తయారు చేసి ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, ముస్లింలపై అనవసర అపవాదాలు మోపడానికి కారణమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశద్రోహ చర్యల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనను ప్రస్తావించిన ఒవైసీ.. ‘మరణించిన వారిలో హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఉన్నారు. దేశానికి శత్రువులైన వారు ముస్లింలకూ శత్రువులే’ అని స్పష్టం చేశారు.
👉ఇదీ చదవండి: ఢిల్లీ బాంబుపేలుళ్లకు హమాస్‌తో లింకులు?


