‘సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్’ తయారీ యూనిట్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఏపీ సహా సరిహద్దు రాష్ట్రాలతో మేం నీటి వివాదాలు కోరుకోవడం లేదు
సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డంకులు సృష్టించొద్దు
మీరు సృష్టించే సమస్యల వల్ల అనుమతులు రావడం లేదు
బ్యాంకు రుణాలే కాదు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అందడం లేదు
కూర్చొని మాట్లాడుకుందాం.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం
ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. మేం 10 అడుగులు వేస్తాం
జల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన లేదన్న సీఎం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో మేము ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదు. పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. తద్వారా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆశిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాలు అడ్డంకులు సృష్టించొద్దు. మీరు సృష్టించే సమస్యల వల్ల తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలే కాదు.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కూడా అందకుండా పోతోంది. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం.
ఇందుకోసం ఏపీ ఒక అడుగు ముందుకేస్తే... పది అడుగులు ముందుకు వేసే తత్వం మాది. పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఓ సూచన చేస్తున్నా. నీళ్ల వివాదాన్ని రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలకు అతీతంగా చర్చించి, సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం. ఇందుకోసం న్యాయ స్థానాలు, ఇతరుల సమక్షంలో కూర్చొనే కంటే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడం ఉత్తమం. మీకు పంచాయితీలు కావాల్నా? నీళ్లు కావాల్నా? నేనైతే జలాలు కావాలనే కోరుకుంటా. వివాదాలు కావాల్నా? పరిష్కారం కావాల్నా? అంటే పరిష్కారమే కోరుకుంటా..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగర శివార్లలోని రావిర్యాల ఫ్యాబ్‌సిటీలో ‘సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్’తయారీ యూనిట్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.
పక్క రాష్ట్రంతో సయోధ్య అవసరం
‘కృష్ణా బేసిన్‌లో పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యాయి. కానీ ఏపీ అభ్యంతరాల వల్ల వాటికి పర్యావరణ, సీడబ్య్లూసీ అనుమతులు, బ్యాంకులు, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఇది రాష్ట్రానికి భారంగా పరిణమిస్తోంది. ఇక్కడ డేటా సెంటర్లు పెట్టాలంటే విద్యుత్‌తో పాటు నీరు కూడా కీలకం. కృష్ణానది నుంచి ఇక్కడికి నీటిని తరలించాలన్నా..యాదాద్రి నుంచి కరెంట్ తరలించాలన్నా.. పరస్పర సహకారం అవసరం. తెలంగాణకు పోర్టు రావాలన్నా..ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయాలన్నా పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం అవసరం. అలాగే అమరావతి అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ సహకారం కూడా ఉండాలి..’అని సీఎం అన్నారు.
ప్రపంచ దేశాలతోనే పోటీ
‘రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన, పర్యాటక, ఎండోమెంట్, మెడికల్ పాలసీలను తీసుకొచ్చాం. త్వరలో ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకురానున్నాం. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం పోటీ పడుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి అనుగుణంగా పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుర్గాంవ్‌తో తెలంగాణ పోటీ పడుతోందనే చర్చ పదేపదే జరుగుతోంది. దీనికి పుల్‌స్టాఫ్ పెట్టి జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడాలని ఆలోచన చేస్తున్నాం.
యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ప్రారంభించే పరిశ్రమలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తుంది. దేశ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లలో మూడు ఇక్కడి నుంచే వచ్చాయి. సిలికాన్ వ్యాలిలోని ఐటీ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్న వారు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. సక్సెస్ స్టోరీలు సృష్టించాలి. ప్రభుత్వం ఇప్పటికే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచి్చంది. మరో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరికి ప్రైవేటు రంగంలోనూ అవకాశం కల్పించాలి. ఐఎస్‌ఎస్‌ల కన్నా ప్రైవేటు రంగంలోనే ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రైవేటు రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు.
ఉపాధి అవకాశాలకు పెద్దపీట:.శ్రీధర్‌రాబు
మెడికేర్, ఫార్మా, లైఫ్‌సైన్స్‌కు సంబంధించిన ఎకో సిస్టమ్‌లో నాలుగు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రధానంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమలకు అనుగుణంగా పాలసీలు ఉండాలని భావించి, ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విదేశీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఒడిఎన్ మాల్‌ను ప్రారంభించిన సీఎం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఒడిఎన్ మాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిఎన్ మాల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


