ఇంకెందరున్నారు? ఎక్కడున్నారు? | Intelligence agencies investigating information about unknown Maoist leaders | Sakshi
Sakshi News home page

ఇంకెందరున్నారు? ఎక్కడున్నారు?

Mar 15 2026 1:39 AM | Updated on Mar 15 2026 1:39 AM

Intelligence agencies investigating information about unknown Maoist leaders

మావోయిస్టు అజ్ఞాత నేతల సమాచారంపై రోజూ నిఘా వర్గాల ఆరా 

ఇంకా పోలీసుల అధీనంలోనే లొంగిపోయిన మావోలు 

మావోయిస్టు మాజీ అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి సహా ఇతరుల వరుస దర్యాప్తులు... తెలంగాణ ఎస్‌ఐబీతోపాటు ఎన్‌ఐఏ, ఐబీ సహా ఆయా రాష్ట్రాల పోలీసు అధికారుల ప్రశ్నల పరంపర 

మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ, పార్టీకి సంబంధించిన వివరాలపై ఫోకస్‌

సాక్షి, హైదరాబాద్‌: అడవులను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చినా..మావోయిస్టు మాజీ నేతలు ఇంకా ‘నిఘా’నీడలోనే ఉన్నారు. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, నూనె నర్సింహ్మారెడ్డి అలియాస్‌ గంగన్న సహా మరికొందరు తెలంగాణ పోలీసుల వద్దే సేఫ్‌ షెల్టర్‌లో ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మావోయిస్టులకు సంబంధించి డెడ్‌లైన్‌ మార్చి 31 సమీపిస్తుండడంతో కీలక సమాచారం కోసం తెలంగాణ పోలీస్‌ ప్రత్యేక బృందాలతో కేంద్ర నిఘా ఏజెన్సీలు, ఇతర రాష్ట్రాల పోలీసు నిఘా వర్గాలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. వీలైనంత మేరకు వారికి అవసరమైన సమాచారం కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

సేఫ్‌ షెల్టర్‌లో బస... 
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులను వారివారి స్థాయిని బట్టి కొంత కాలం పాటు పోలీసులు తమ అ«దీనంలో పెట్టుకోవడం సర్వసాధారణమే. అదేవిధంగా మావోయిస్టు మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, నూనె నర్సింహ్మారెడ్డి అలియాస్‌ గంగన్న సహా మరికొందరు ఇంకా తెలంగాణ ఎస్‌ఐబీ పర్యవేక్షణలోనే సేఫ్‌ షెల్టర్‌లో ఉన్నారు. వీరికి డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కల్పిస్తున్నారు. సాధారణ జనజీవితానికి అలవాటు పడేలా రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పార్టీకి సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు దేవ్‌జీ సహా నలుగురితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలో గడిపిన జీవితానికి భిన్నంగా.. రోజూ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రించేంత వరకు వారివారి అభీష్టానికి అనుగుణంగా దినచర్యకు సహకరిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు చెప్తున్నారు. పత్రికలు చదవడం, టీవీలో వార్తలు చూడడంతో పాటు వ్యాయామం సహా షెడ్యూల్‌ ప్రకారం వారికి నచ్చిన భోజనం అందిస్తున్నారు. 

వరుసకట్టిన దర్యాప్తు ఏజెన్సీలు...  
ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలనుంచి తమకు కావాల్సిన సమాచార సేకరణపై తెలంగాణ పోలీస్‌లతోపాటు ఇతర ప్రత్యేక విభాగాలు దృష్టి పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి జాడ కోసం అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది. గణపతి సహా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు లొంగుబాటు కోసం తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)తోపాటు ఆయా జిల్లాల పోలీసు యూనిట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సుదీర్ఘ కాలంపాటు మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి , బడే చొక్కారావు ఇతరులను సేకరించే సమాచారం కీలకం కావడంతో తెలంగాణ నిఘా విభాగాలు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు చెందిన అధికారులు సైతం వారిని పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, బిహార్‌ రాష్ట్రాల నిఘా అధికారులు సైతం వీరిని ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ‘ఇప్పటికే తెలంగాణ ఎస్‌ఐబీతోపాటు ఎన్‌ఐఏ అధికారులు, ఐబీ అధికారులు మమ్మల్ని ప్రశ్నించారు. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడుతున్నరు. ఇంకా ఎంత మంది వస్తారో ’అని మావోయిస్టు అగ్రనేత ఒకరు చెప్పారు. నిఘా అధికారుల సమాచార సేకరణ ఇంకా కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement